కోవిడ్-19 మహమ్మారి మూడో ప్రభంజనం మరింత వికృతంగా ఉండబోతోందని హెచ్చరికలు వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అప్రమత్తం చేసింది. ఇప్పుడు సిద్ధమైతే రాబోయే ప్రభంజనాన్ని దీటుగా ఎదుర్కొనగలుగుతామని తెలిపింది. ఆక్సిజన్ నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపింది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ పంపిణీ విధానాన్ని సమీక్షించుకోవాలని పేర్కొంది. ఢిల్లీ నగరానికి ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఈ సలహా ఇచ్చింది. ఢిల్లీలోని కోవిడ్ రోగులకు రోజుకు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రణాళికను సుప్రీంకోర్టు పరిశీలించింది.
ఇప్పుడు మనం చేయవలసినది యావత్తు భారత దేశం అవసరాలకు తగిన ప్రణాళికను రూపొందించడమని చెప్పారు జస్టిస్ డీవై చంద్రచూడ్. ఆక్సిజన్ ఆడిట్ జరగాలని, ఆక్సిజన్ కేటాయింపుల కోసం ప్రాతిపదికను మరోసారి మదింపు చేయవలసిన అవసరం ఉందని స్పష్టమవుతోందన్నారు. ఇప్పుడు మనం కోవిడ్-19 మహమ్మారి రెండో దశలో ఉన్నామని, రాబోయే మూడో దశ మరింత విభిన్నంగా ఉండవచ్చునని అన్నారు. మనం ఇప్పుడే సిద్ధమైతే మూడో దశను ఎదుర్కొనగలుగుతామని చెప్పారు. ఓ రాష్ట్రానికి ఆక్సిజన్‌ను కేటాయించడం గురించి మాత్రమే కాదని, సరైన రీతిలో ఆక్సిజన్ ఆడిట్ జరగడం కూడా ముఖ్యమైనదేనని చెప్పారు. ఆక్సిజన్ పంపిణీకి సరైన మార్గదర్శకాలను రూపొందించాలన్నారు.