Wednesday, November 20, 2024

పరీక్షల నిర్వహణ విషయంలో ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జూలై చివరివారంలో పరీక్షలు నిర్వహిస్తామని అఫిడవిట్‌లో చెప్పారని, దీనిపై పక్కా సమాచారం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. అఫిడవిట్‌లో పక్కా సమాచారం ఎక్కడా కనిపించలేదని, పరీక్షల నిర్వహణపై 15 రోజులు ముందుగా చెప్తామని అఫిడవిట్‌లో చెప్పారని సుప్రీంకోర్టు పేర్కొంది. 15 రోజుల సమయం సరిపోతుందని ఎలా చెబుతారని కోర్టు ప్రశ్నించింది. పరీక్షల నిర్వహణ సిబ్బంది వివరాలు ఏవీ ఇవ్వలేదని, ప్రభుత్వమే అన్నిరకాల లాజిస్టిక్ వసతులు కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

విద్యార్థులతో పాటు సిబ్బంది రక్షణ బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒక‌వేళ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే, దాని వ‌ల్ల ఒక్కరు మ‌ర‌ణించినా.. కోటి ప‌రిహారం ఇవ్వాల‌ని కోర్టు త‌న తీర్పులో హెచ్చ‌రించింది. కొన్ని రాష్ట్రాలు ఇలాంటి నిబంధ‌న పాటిస్తున్న‌ట్లు సుప్రీం ధ‌ర్మాస‌నం చెప్పింది. ఏపీలో బోర్డు ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని దాఖ‌లు చేసిన పిటిష‌న్‌లో కోర్టు ఈ హెచ్చ‌రిక చేసింది.

గాలి, వెలుతురు ఉండే గదుల్లో పరీక్షలు నిర్వహించే విషయంపై వివరాలు లేవని, లెక్కల ప్రకారం చూస్తే సుమారు 28 వేల గదులు అవసరమవుతాయని కోర్టు అభిప్రాయపడింది. రెండో దశలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో కళ్లారా చూశామని, ఒక్కో గదిలో 15, 20 మంది ఎలా సాధ్యమవుతుందని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 34 వేలకుపైగా గదులు అవసరవుతాయి.. అది ఆలోచించారా అని సూటిగా అడిగింది. ఇంత పెద్ద మొత్తం గదులను ఎలా అందుబాటులోకి తీసుకొస్తారని సందేహం వ్యక్తం చేసింది. పరీక్ష నిర్వహించాం.. పని అయిపోయిందని అనుకోలేం కదా అని ధర్మాసనం అభిప్రాయపడింది. పరీక్ష తర్వాత వాటిని మూల్యాంకనం చేయాలని.. మూల్యాంకనం తర్వాత చాలా ప్రక్రియ ఉంటుందని, మూల్యాంకనం, తదనంతర ప్రక్రియ వివరాలు అఫిడవిట్‌లో లేవని సుప్రీంకోర్టు తెలిపింది. కరోనాకు పలు వేరియంట్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నా ఎందుకిలా వ్యవహరిస్తున్నారని, పరీక్షల నిర్వహణలో ఒక నిర్ణయాత్మక ప్రణాళిక ఉండాలని.. కానీ ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌లో అంతా అనిశ్చితే ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement