Friday, November 22, 2024

జర్నలిస్టు వినోద్ దువాపై దేశ ద్రోహం కేసు కొట్టివేత

హిమాచల్‌ప్రదేశ్ కు చెందిన సీనియర్ జర్నలిస్టు వినోద్ దువాపై దేశద్రోహం కేసు కొట్టివేసింది సుప్రీంకోర్టు. ఢిల్లీ అల్లర్లపై వినోద్‌ దువా చేసిన వ్యాఖ్యలపై హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం దేశద్రోహం కేసు నమోదు చేశారు. దీనిపై ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. కేదార్‌నాథ్‌ కేసు తీర్పును పరిగణనలోకి తీసుకుంటే ఈ కేసు చెల్లదని స్పష్టం చేసింది. దువాపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది. జస్టిస్ లలిత్, జస్టిస్ వినిత్ శరణ్  బెంచ్ గత ఏడాది అక్టోబర్ 6వ తేదీన ఈ కేసుపై తీర్పును రిజర్వ్ చేసింది. జర్నలిస్ట్ వినోద్ దువాతో పాటు హిమాచల్ ప్రదేశ్ వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు తీర్పు వెలువరించింది.

దేశంలో ఓ వైపు కరోనా మరణాలు, మ‌రోవైపు ఉగ్రవాద దాడులపై కూడా ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారని వినోద్ ఏడాది క్రితం యూట్యూబ్‌ వీడియోలో వ్యాఖ్యానించారు. దీంతో హిమాచల్‌ ప్రదేశ్‌ కు చెందిన ఓ బీజేపీ నేత ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినోద్ దువాపై దేశద్రోహంతో పాటు ప‌లు కేసులు న‌మోదు చేశారు. దీంతో తన‌కు భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ ఉంద‌ని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఏ) ప్రకారం త‌న వ్యాఖ్య‌లు భావ ప్రకటనా స్వేచ్ఛ‌ కిందకే వస్తాయని అప్పట్లో వినోద్ చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయాలని కోరుతూ వినోద్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై గత ఏడాది కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు హిమాచల్ ప్రదేశ్‌ ప్రభుత్వాలకూ నోటీసులు జారీచేసి విచారణ కొన‌సాగిస్తూ వ‌చ్చింది. చివ‌ర‌కు ఆయ‌న‌పై ఎఫ్ఐఆర్‌ను కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది.

ఇది కూడా చదవండి: రూ.60కే కరోనా డ్రై స్వాబ్ పరీక్ష

Advertisement

తాజా వార్తలు

Advertisement