Friday, November 22, 2024

బ్యాంకుల మోసాలపై ఉదాసీనత, ఆర్​బీఐ పాత్రపై ఎంక్వైరీ చేయాలే.. సుప్రీంకోర్టులో పిటిషన్​

దేశంలోని పలు బ్యాంకుల నుంచి వేలాది కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకుని ఆ తర్వాత చెల్లింపులు చేయకుండా ఎగ్గొట్టే బడా వ్యాపారుల విషయంలో ఆర్​బీఐ కానీ, సీబీఐ కానీ ఎట్లాంటి యాక్షన్​ తీసుకోవడం లేదని.. వినియోగదారులు, బ్యాంకు వాటాదారుల ప్రయోజనాలను అస్సలు పట్టించుకోవడం లేదని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్​​ దాఖలైంది. రెండేళ్ల కాలంలో ఎన్నో కేసులు ఇట్లానే నమోదవుతున్నాయని, ఇందులో ఆర్​బీఐ అధికారుల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలపై విచారణ చేపట్టాలని పిటిషనర్లు కోరారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

వివిధ బ్యాంకింగ్, ఆర్థిక కుంభకోణాల్లో ఆర్‌బీఐ అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాలని దాఖలైన పిటిషన్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి, న్యాయవాది సత్య సబర్వాల్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని న్యాయమూర్తులు బీఆర్ గవాయి, బీవీ నాగరత్నతో కూడిన డివిజన్ బెంచ్ తెలిపింది.

గత రెండేళ్లలో ఆర్‌బీఐ, ఇతర ఏజెన్సీలు గుర్తించిన బ్యాంకింగ్ మోసాల సంఖ్య పెద్ద మొత్తంలో ఉందని పిటిషనర్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. అట్లాంటి మోసాల్లో అధికారుల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే.. విస్తృత అధికారాలు ఉన్నప్పటికీ డిపాజిటర్లు, పెట్టుబడిదారులు, వాటాదారుల ప్రయోజనాలను రక్షించడంలో ఆర్‌బీఐ విఫలమైందని పిటిషనర్లు వాదించారు.

ఇక.. వారి అభ్యర్ధనలో.. బ్యాంకు మోసాల పరంపరపై సీబీఐ కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, దాని గురించిన పలు ప్రశ్నలు లేవనెత్తారు.. పిటిషనర్లు నీరవ్ మోడీకి సంబంధించిన పంజాబ్​ నేషనల్​ బ్యాంక్ రుణ డిఫెక్ట్ తో సహా వివిధ కుంభకోణాలపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టును కోరారు. అయితే ఈ అంశంపై త్వరలోనే విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు డివిజన్​ బెంచ్​ స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement