నేటి నుంచి ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ భారతీయ భాషల్లోనూ తీర్పులను అందుబాటులో ఉంచే సేవలను ప్రారంభించారు. దానికి కొన్ని షెడ్యూల్డ్ భాషలలో తీర్పుల అనువాదప్రతులు సిద్ధంగా ఉంచామని సీజేఐ చెప్పారు. ఈ-ఎస్సిఆర్…ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్టుల ప్రాజెక్టు జనవరి 26 గురువారం నుంచి మొదలవుతుందన్నారు. ప్రజలు, న్యాయ విద్యార్థులు, న్యాయవాదులు ఈ ప్రతులను ఉచితంగానే ఉపయోగించుకోవచ్చు అని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పులను దేశంలోని గుర్తించిన అన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదించేలా కృషి కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ-ఎస్సిఆర్ ప్రాజెక్టులో భాగంగా సర్వోన్నత న్యాయస్థానానికి సంబంధించిన వెబ్ సైట్స్ తో ఇప్పుడు దాదాపు 34 వేల తీర్పులు ఉన్నాయన్నారు.
ఏ తీర్పుకు సంబంధించిన విషయం తెలుసుకోవాలంటే.. దానికి సంబంధించిన విషయాన్ని సెర్చ్ ఇంజిన్ లో టైప్ చేయాలని.. అప్పుడు దానికి సంబంధించిన జడ్జిమెంట్ ప్రతులు ఇంగ్లీషులో వస్తాయని చెప్పారు. ఆ తీర్పులతోపాటు అది ఏ ఏ భాషల్లోకి అనువాదమయ్యాయో కూడా పక్కన లిస్ట్ చూపిస్తుందని అన్నారు. అందులో తమకి ఇష్టమైన భాషను సెలెక్ట్ చేసుకుని తీర్పులను చదువుకోవచ్చు అని తెలిపారు. ఈ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ఇకపై నిరంతరం కొనసాగుతుంది. అనువాదప్రతులను కక్షిదారుల సౌకర్యార్థం క్రమం తప్పకుండా తప్పకుండా అప్ లోడ్ చేస్తూ ఉంటామని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వెల్లడించింది. దీని మీద మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందిస్తూ ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పులను ప్రాంతీయ భాషలలో కూడా చదువుకునే వీలు కల్పించే ప్రయత్నం అభినందనీయమని అన్నారు. తద్వారా గ్రామ- పట్టణాల మధ్య ఉన్న తేడాను భర్తీ చేయచ్చని.. ఆ దిశగా ఇదొక గొప్ప ముందడుగు అని అన్నారు.