పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై 10 రోజుల్లోగా సమాధానమివ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. పెగాసస్ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌లపై వరుసగా రెండో రోజు విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
పిటిషనర్లు కోరినట్లుగా నిఘాకు సంబంధించిన సమాచారం కోర్టుకు వెల్లడించడం జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. సోమవారం దాఖలు చేసిన అఫిడవిట్ సరిపోతుందని, అంతకు మించిన సమాచారం కొత్తగా ఏమీ లేదని వివరించారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం జాతీయ భద్రత విషయంలో రాజీపడే ఏ అంశాన్ని కూడా కేంద్రం బయటకు వెల్లడించాలని తాము కోరడం లేదని పేర్కొంది. పిటిషన్‌లపై విచారణను 10 రోజుల తర్వాత చేపడతామని తెలిపింది.