దేశంలో విచ్చలవిడిగా సాగుతున్న డ్రగ్స్ దందాపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న విధానం, లోకల్ గ్యాంగుల నిర్వాకంపై సుప్రీంకోర్టు ఆరా తీసింది. దీన్ని సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసింది. అయితే.. ఇదంతా మాజీ సీజేఐ ఎన్వీ రమణ లేఖ ఆధారంగానే జరిగిందని తెలుస్తోంది. ఇక.. కోర్టు విచారణలో సహకారిగా షోయబ్ ఆలం నియమకమయ్యారు. ఈ క్రమంలో ఇవ్వాల (సోమవారం) కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. కాగా, అక్టోబర్ 18వ తేదీ నుంచి డ్రగ్స్ కేసు విచారణ చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
గుజరాత్, ముంబయి రాష్ట్రాల నుంచే దేశంలోకి..
దేశంలో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. దీనికి అడ్డాగా గుజరాత్, ముంబయి రాష్ట్రాలే అడ్డగా మారాయి. దీనికి అక్కడ పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టుబడడమే సాక్ష్యం. ముఖ్యంగా యువతను టార్గెట్ చేసుకుంటున్న డ్రగ్స్ మాఫియా ఆ మేరకు మత్తు పదార్థాలను సప్లయ్ చేస్తోంది. దీనికోసం సరికొత్త మార్గాలను కూడా అన్వేషిస్తోంది. లేటెస్ట్ గా ముంబై ఎయిర్‌పోర్టు, గుజరాత్ పోర్టులలో పట్టుబడిన హెరాయిన్‌తో ముఠా ఆనవాళ్లు లభించాయి. దాదాపు వేల కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలను అధికారులు సీజ్ చేశారు.
ఈ మధ్య గుజరాత్ తీరంలో డ్రగ్స్ కలకలం చెలరేగింది. రూ.2 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు అధికారులు. ఎన్సీబీ, నేవీ జాయింట్ ఆపరేషన్‌లో ఈ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. మొత్తం 800 కేజీల డ్రగ్స్ సీజ్ చేశారు. మరోవైపు వారం క్రితం భారత్- పాకిస్థాన్ సరిహద్దులో భారీగా హెరాయిన్ సీజ్ చేశారు. 14 కిలోలకుపైగా హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దీని విలువ రూ. 35 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేశారు. పాకిస్థాన్ మీదుగా భారత్‌లోకి ఈ డ్రగ్స్‌సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. బీఎస్ఎఫ్, రాజస్థాన్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో ఈ హెరాయిన్ పట్టుబడింది. ఇక ఇటీవల మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోనూ.. 25కోట్ల రూపాయల హెరాయిన్ పట్టుబడింది.