Saturday, November 23, 2024

కరోనా కట్టడికి రంగంలోకి సుప్రీం..టాస్క్‌ఫోర్స్‌ టీం ఏర్పాటు..

దేశంలో కరోనా కట్టడికి స్వయంగా సుప్రీంకోర్టు రంగంలోకి దిగుతోంది. ఇప్పటికే పలుమార్లు కరోనా కట్డడిపే కేంద్రాన్ని హెచ్చరించిన సుప్రీం స్వయంగా కరోనా ను కట్టడి చేసేందుకు పరిస్థితులను చక్కదిద్దేందుకు నడుం బిగించింది. ఆక్సిజన్‌ అందక కరోనా రోగులు పిట్టల్లా రాలుతున్న దృశ్యాలు నిత్యకృత్యంగా మారడంతో.. రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య శాస్త్రీయంగా, హేతుబద్ధంగా, సమానరీతిలో ఆక్సిజన్‌ను పంపిణీ చేసే విధానాన్ని రూపొందించేందుకు 12 మంది సభ్యులతో జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. అలాగే కొవిడ్‌ చికిత్సకు అవసరమైన ఔషధాలకు కొరత ఏర్పడకుండా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా ఈ టాస్క్‌ఫోర్స్‌ సూచనలు చేయనున్నది. భవిష్యత్‌లో తలెత్తే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ర్టాలకు సహకారం అందించనున్నది.

మరోవైపు, ఆడిటింగ్‌ కోసం ప్రతి రాష్ట్రంలో, కేంద్రపాలిత ప్రాంతంలో సబ్‌ గ్రూప్‌లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించిన సబ్‌ కమిటీలో ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా, మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌కు చెందిన సందీప్‌ బుదిరాజాతోపాటు సంయుక్త కార్యదర్శి కంటే పై ర్యాంకు గల ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు (ఒకరు ఢిల్లీ ప్రభుత్వం నుంచి, మరొకరు కేంద్రం నుంచి) సభ్యులుగా ఉంటారు. టాస్క్‌ఫోర్స్‌కు కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. అవసరమైతే తనకు సహాయంగా అదనపు కార్యదర్శి కంటే పై స్థాయి అధికారిని నామినేట్‌ చేసుకోవచ్చు. కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా వ్యవహరిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement