క్రిమినల్ కేసుల్లో ‘భద్రత లేని సాక్షుల’ (వల్నరబుల్ విట్నెస్) పరిధిలోకి వచ్చే వ్యక్తులకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. వయసుతో సంబంధం లేకుండా, స్త్రీలు – పురుషులు అనే తేడా లేకుండా… లైంగిక దాడులకు గురైన అందరినీ భద్రత లేని సాక్షులుగా పరిగణించాలని కోర్టు పేర్కొంది. వీరితోపాటు మానసిక రోగులు, మూగవారు, బధిరులు కూడా ఇలాంటి సాక్షుల పరిధిలోకి వస్తారని స్పష్టం చేసింది. తమకు భద్రత లేదని భావించే ఇతర సాక్షులను కూడా ఈ విషయంలో పరిగణనలోకి తీసుకోవచ్చని సుప్రీం కోర్టు పేర్కొంది. 2018లో కేంద్రం తీసుకొచ్చిన సాక్షుల రక్షణ స్కీమ్ (విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్)ను అనుసరించి ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్టు తెలిపింది. ఢిల్లీ హైకోర్టు గతంలో రూపొందించిన ‘వల్నరబుల్ విట్నెస్ డిపొజిషన్ స్కీమ్’ (వీడబ్ల్యూడీసీ) ప్రకారం.. 18 ఏళ్లలోపు వయసున్నవారినే భద్రత లేని సాక్షులుగా కోర్టులు పరిగణిస్తున్నాయి. సుప్రీం తాజా ఆదేశాలతో మ రింతమంది ఇలాంటి సాక్షుల కేటగిరీలోకి వస్తారు.
ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం హైకోర్టులకు ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశాల అమలుకు తీసుకోవాల్సిన చర్యలను కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతి జిల్లా కోర్టులో వీడబ్ల్యూడీసీ ప్రకారం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు హైకోర్టులు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఒక్కో రాష్ట్రంలో ఇలాంటి కేంద్రాలు ఎన్ని అవసరమో హైకోర్టులు అంచనా వేసి మూడు నెలల్లోగా తెలియజేయాలని స్పష్టం చేసింది. వీటికి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా విడుదల చేయాలని ఆదేశించింది. ఈ కేంద్రాల ఏర్పాటును పర్యవేక్షించడంతోపాటు.. న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి వీటిపై అవగాహన కల్పించడానికి జమ్మూ కశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిత్తల్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital