మరాఠా రిజర్వేషన్ కోటాపై సాగుతున్న కేసులో సుప్రీంకోర్టు శుక్రవారంనాడు కొన్ని అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. విద్య, ఉద్యోగాల్లో ఇంకా ఎన్ని తరాల పాటు రిజర్వేషన్లు ఇస్తూ పోతారని సుప్రీంకోర్టు ప్రభుత్వాలను ప్రశ్నించింది. రిజర్వేషన్లపై పరిమితి విధించిన మండల్ కమిషన్ తీర్పును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ అన్నపుడు జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘1931 నాటి జనాభా లెక్కల ప్రకారం మండల్ తీర్పు వెలువడింది. నాటికీ నేటికీ పరిస్థితులు మారాయి. జనాభా పెరిగి 135 కోట్లకు చేరింది. ఇందులో వెనుకబాటుతనం ఉంటూనే వచ్చింది. అంతేకాక కేంద్రం ఆర్థికంగా వెనుకబడ్డ కులాల వారికి కల్పించిన 10 శాతం రిజర్వేషన్ల కారణంగా గతంలో సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితి కూడా పోయింది. ఈబీసీ కోటా దాన్ని దాటేసింది’’అని రోహత్గీ అన్నారు. ఆ దశలో బెంచ్ కల్పించుకుని ‘పరిమితే లేనపుడు ఇక సమానత్వానికి ప్రాతిపదిక ఏంటి? మనం తేల్చాల్సినది అది. రిజర్వేషన్ల పరిమితి లేనపుడు ఏర్పడే అసమానతల మాటేంటి? ఇలా ఎన్ని తరాలకు రిజర్వేషన్లిస్తారు?’అని ధర్మాసనం ప్రశ్నించింది.
‘దేశంలో ఏం జరుగుతుందో పార్లమెంట్‌కు తెలుసు. రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించరాదని కూడా పార్లమెంటుకు తెలుసు. అయినా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. అలాంటప్పుడు మీరిలా పరిమితిని మించడం తప్పు అని ఏ కోర్టూ చెప్పలేదే?’ అని కూడా రోహత్గీ వ్యాఖ్యానించారు. ‘‘అనేక రాష్ట్రాలు 50% పరిమితిని మించాయి. అలాంటపుడు ఇది నలుగుతున్న సమస్యే కదా.. అలా కాదనీ, 30 ఏళ్ల తరువాత మండల్ తీర్పును సమీక్షించలేమని అని ఎవరూ అనలేరు’అని మరాఠా కోటాకు అనుకూలంగా వాదించిన ముకుల్ రోహత్గీ అన్నారు. కాగా 102వ రాజ్యాంగ సవరణను సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌పై సుప్రీం బెంచ్ కేంద్రానికి నోటీసులిచ్చింది. మహారాష్ట్రకు చెందిన శివ్ సంగ్రామ్ అనే రాజకీయ పక్షం ఈ పిటిషన్ వేసింది.