మన సూపర్ సోనిక్ మిస్సైల్ యాక్సిడెంటల్‌గా టెస్ట్ ఫైర్ అయ్యి పాకిస్థాన్ భూభాగంలో పడింది. అయితే దీనిపై ప్రతీకార దాడులకు పాకిస్థాన్ తెగబడేందుకు రెడీ అయ్యిందని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. మరో క్షిపణిని ఫైర్ చేసేందుకు పాక్ సిద్ధమైందని పేర్కొంది. అయితే.. ఏదో పొరపాటు వల్ల ఇలా జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేయడం వల్ల ప్రతీకార దాడులపై పాక్ వెనక్కి తగ్గిందని ఆ వర్గాలు వెల్లడించాయి. భారత్‌కు చెందిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణి ఈ నెల 9న వర్క్‌లో భాగంగా టెస్ట్ ఫైర్ అయ్యింది. పంజాబ్‌లోని అంబాలా నుంచి ఈ ఘటన జరిగింది. అయితే ఆ వెంటనే భారత వాయుసేన అప్రమత్తమైంది. మరిన్ని క్షిపణుల ప్రయోగం జరుగకుండా ఉండేందుకు క్షిపణి వ్యవస్థలను నిలిపివేసింది. దీనిపై భారత, పాక్ ఆర్మీ కమాండర్ల మధ్య హాట్‌లైన్‌లో ఎలాంటి మాటలు జరుగలేదని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. కాగా, పేలుడు పదార్థంలేని సూపర్ సోనిక్ క్షిపణి తమ భూభాగంలోని 124 కిలోమీటర్ల పరిధిలో పడిందని పాకిస్థాన్ ఆరోపించింది.
భారత క్షిపణి పడిన ప్రాంతం అత్యంత కీలకం కానప్పటికీ దీనివల్ల గోడ కూలిందని పాక్ వాయుసేన తెలిపింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని చెప్పింది. క్షిపణి 40,000 అడుగుల ఎత్తులో దూసుకెళ్లిందని, పాక్ భూభాగంలోని పౌర నివాసాలు, పాక్‌తోపాటు భారత్ గగనతలంలోని ప్రయాణ విమానాలకు ముప్పును రేకెత్తించిందని పాకిస్థాన్ పేర్కొంది. ఈ చర్యను ఖండిస్తున్నట్లు తెలిపింది. పాకిస్థాన్ వాయుసేన దీన్ని పొరపాటుగా భావించకపోతే పరిణామాలు చాలా సీరియస్‌గా ఉండేవని ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ అన్నారు. కాగా, ఈ ఘటనపై ఈ నెల 11వ తేదీన భారత్ స్పందించింది. సాంకేతిక లోపంవల్ల ఇట్లా జరిగిందని, దీనిపై ఎంక్వైరీ కూడా చేస్తున్నామని, ఇట్లా జరగడంపై విచారం కూడా వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించడడంతోపాటు ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపింది.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా మంగళవారం దీని గురించి పార్లమెంట్‌కు వివరణ ఇచ్చారు. ఈ ఘటన తర్వాత క్షిపణి కార్యకలాపాలు, నిర్వాహణ, తనిఖీల కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలపై సమీక్ష జరిగిందని తెలిపారు. ‘భారతదేశం తన భద్రత, క్షిపణి వ్యవస్థల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. దర్యాప్తులో తేలిన అంశాలపై ప్రభుత్వం పరిశీలిస్తుంది’ అని చెప్పారు. అయితే ప్రతీకార దాడులకు పాక్ సిద్ధమైందన్న బ్లూమ్‌బెర్గ్ నివేదిక గురించి భారత ప్రభుత్వం లేదా ఆర్మీ అధికారులు స్పందించలేదు.