సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం!
గత ధర్మాసనం తీర్పు తోసివేత
ఉపకులాలు ఒకే సమూహం కాదు
సుప్రీం కోర్టు సంచలన తీర్పు
కేసు ఒకటే, తీర్పులు ఆరు..
నిర్ణయం మాత్రం ఏకాభిప్రాయం
6 : 1 నిష్పత్తిలో జడ్జీల నిర్ణయం
30 ఏళ్ల పోరాట ఫలితం
చంద్రబాబు, మోదీకి కృతజ్ఞతలు
మంద కృష్ణ మాదిగ భావోద్వేగం
ఆంధ్రప్రభ స్మార్ట్, న్యూఢిల్లీ ప్రతినిధి: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ల ఉప వర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు విభజించవచ్చని గురువారం కీలక తీర్పునిచ్చింది. ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేది మాత్రమే విభేదించగా మిగిలిన ఆరుగురు ఉపవర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల్లో ఉప కులాలను ‘హోమోజీనస్ క్లాస్’ (ఒకే సమూహంగా భావించలేమని) కాదని, వారి జనాభా గణాంకాలు, సామాజిక ఆర్థిక పరిస్థితుల వంటి డేటా ఆధారంగా రాష్ట్రాలు వర్గీకరించవచ్చని జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులో పేర్కొన్నారు.
కేసు ఒకటి.. ఆరు తీర్పులు, నిర్ణయమూ ఒకటే జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీశ్ చంద్ర మిశ్రా సభ్యులుగా ఉన్నారు. వీరు ఈ కేసులో ఆరు తీర్పులను విడివిడిగా ఇచ్చారు. ఉప వర్గీకరణకు అనుకూలంగా జస్టిస్ మిశ్రాకు, తనకు కలిపి సీజేఐ ఒక తీర్పు రాశారు. మిగిలిన నలుగురు ఇదే వైఖరితో నాలుగు తీర్పులు విడివిడిగా ఇచ్చారు. వీరిలో ఒకరైన జస్టిస్ బీఆర్ గవై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీల్లో క్రీమీ లేయర్‌ను గుర్తించి, వారిని రిజర్వేషన్ పరిధి నుంచి తప్పించాలని సూచించారు. జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఉపవర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. మెజారిటీ తీర్పుతో తాను విభేదిస్తున్నానని, రాజ్యాంగంలోని 341వ అధికరణ కింద నోటిఫై చేసిన ఎస్సీ జాబితాను మార్చే అధికారం రాష్ట్రాలకు లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
కేంద్రం వాదన ఇదీ!
ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు తెలిపింది.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గీకరణతో సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. అప్పుడే ప్రభుత్వాలు సరైన పథకాలు రూపొందించగలవని తెలిపింది. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే కల ఉపవర్గీకరణతో సాకారం అవుతుందని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు తీసుకురావడం వెనుకున్న లక్ష్యం చేరుకోవాలంటే కోటా హేతుబద్ధీకరణ చాలా ముఖ్యమని వివరించారు.
పంజాబ్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ వరకూ..
వాల్మీకీలు, మఝాబీ సిక్కులకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనను 2010 లో పంజాబ్, హరియాణా హైకోర్టు కొట్టివేసింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఎస్టీ కోటాలో ఉప వర్గీకరణలు రాజ్యాంగంలోని 14వ అధికరణకు విరుద్ధమని 2004లో ‘ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్’ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును ఆధారంగా చేసుకుని పంజాబ్ సర్కారు నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అయితే, హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2011లో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2020లో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టింది. దీనిపై పునఃసమీక్ష కోసం ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది. ఇప్పుడు ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
సప్త సభ్యుల విచారణ..
ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తూ సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం నిర్ణయించింది. పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ వర్గీకరణపై భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పంజాబ్ గవర్నమెంట్ వేసిన పిటిషన్‌ను ప్రధాన పిటిషన్‌గా స్వీకరిస్తూ సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వర్గీకరణకు అనుకూలంగా, వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లను కూడా విచారించింది. అయితే.. వర్గీకరణపై దాఖలైన అన్ని పిటిషన్లను పంజాబ్ పిటిషన్‌కు న్యాయస్థానం జత చేసి విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లలో ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణకు రాష్ట్ర మంత్రి దామోదర రాజ నరసింహ హాజరయ్యారు.
అసెంబ్లీలు ఆలోచించాలి
విచారణలో భాగంగా అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని ప్రశ్నలను సంధించింది. అసమానతలను తొలగింపునకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ధర్మాసనం ప్రశ్నించింది. వర్గీకరణకు రాష్ట్ర శాసనసభలు సిద్ధంగా ఉన్నాయా అంటూ వివరణ కోరింది. ఈ కేసు విచారణలో భాగంగా అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను రాజ్యాంగ ధర్మాసనం తెలుసుకోనుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వర్గీకరణను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిందని గుర్తు చేశారు.
ఇరవై ఏళ్ల కిందటే .. సవరణకు నాందీ
2004లో చంద్రబాబు సర్కారు కల్పించిన వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. అయితే వర్గీకరణకు రాజ్యాంగ సవరణ చేయాలని ఉషా మెహ్రా కమిషన్ స్పష్టం చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ, గిరిజన, న్యాయశాఖ, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులు ఉన్నారు. ఈ విషయాలను అన్నింటిని పరిగణలోకి తీసుకున్న సీజేఐ నేతృత్వంలోని ఏడుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం విచారణను చేపట్టి ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నెరవేర్చారు.
ఇది 30 ఏళ్ల పోరాట ఫలితం : మంద కృష్ణ మాదిగ
సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ భావోద్వేగానికి గురయ్యారు. మీడియా ఎదుటే ఆయన కంటనీరు పెట్టుకున్నారు. ‘మా 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించింది. ఈ ప్రక్రియ వేగవంతానికి ప్రధాని నరేంద్ర మోదీ చొరవ తీసుకున్నారు. అమిత్‌షా, వెంకయ్యనాయుడు, కిషన్‌రెడ్డికి ధన్యవాదాలు. వర్గీకరణ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విజయాన్ని అమరులకు అంకితం ఇస్తున్నాం. రిజర్వేషన్ల సిస్టమ్ ఇప్పుడు రెండో అడుగు వేయబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అనివార్యం. వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఉద్యోగ నోటిఫికేషన్లు సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. రీ-నోటిఫికేషన్లు ఇవ్వాలి’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మందకృష్ణ మాదిగ కోరారు. వర్గీకరణకు జనాభా లెక్కలతో పనిలేదని మరోసారి గుర్తు చేశారు. త్వరలో విజయోత్సవ సభ నిర్వహిస్తాం అని మందా కృష్ణ మాదిగ అన్నారు.