దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం
రెండో స్థానంలో తమిళనాడు
చాపర్‌లో అవయవాల తరలింపు
గ్రీన్ చానల్ ఏర్పాటు
2022లో 194 మందికి అవయవ మార్పిడి
అవయవ దానం.. మహా ప్రాణదానం
నవ్వుతూ బతకాలి. నవ్వుతూ చావాలి. ఇదీ సగటు మనిషి కోరిక. చచ్చినాక బతకలేం, ఎంత ఏడ్చినా తిరిగిరాం.. ఇదీ జీవిత సత్యం…మరణానంతరం. శరీరం మట్టిలో కలవవచ్చు. అగ్నిలో బూడిద కావొచ్చు. పుణ్యనదిలో కలవవచ్చు. కానీ, ప్రాణం ఎక్కడికీ పోదు. నువ్వు దూరమైనా నీ ఊపిరి మమ్మల్ని పలకరిస్తుంది. పరామర్శిస్తుంది. నిజంగా నీవు సజీవుడవే. ఇదీ నేటి ఆధునిక సమాజంలో నిత్య సత్యం. నీ అవయదానంతో నీ సహచరులకు ప్రాణదాతవై ఈ వసుదైక కుటుంబంలో ఓ మనిషి సజీవావతార ఆవిష్కరణ అనిర్వచనీయం. భాషకు అందని భావోద్వేగం. ఇప్పడు కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న గుండెకు ఊపిరి అందుతోంది. హృదయ లయకు స్పందన లభిస్తోంది. అంతేనా… ప్రాణాలను హరించే మృత్యువు కాళ్లకు అవయదానంతో మనిషి బంధనాలు వేస్తున్నాడు. ఇందులో తెలంగాణ బిడ్డలు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు.
– ఆంధ్రప్రభ స్మార్, హైదరాబాద్ ప్రతినిధి
ప్రాణం పోయినా… బతికున్న గుండెల్లో పదిలం కావటం సాధారణ విషయం కాదు. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆర్గనిజేషన్ గణాంకాల ప్రకారం తెలంగాణ అవయవదాతలు అగ్రగ్రాములై… ఎందరో ప్రాణాలను నిలిపారు. అంతేనా దేశంలోనే అవయవ దాతలకు స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. అనూహ్య ప్రమాదాల్లోనూ కాదు, అనూహ్య జీవన్మరణ సమస్యలోనూ.. తమ ప్రాణాలకు సజీవ యోగ్యతను సాధించటంలో తెలంగాణ మానవత్వం చిరస్మరణీయంగా మారింది.
తమిళనాడు, గుజరాత్ కంటే తెలంగాణ బెస్ట్..
తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర చరిత్రలను తిరగరాస్తోంది. 2021 అంటే కరోనా మృత్యు వేట అనంతరం… సభ్య సమాజంలో అనూహ్య మార్పు తెరమీదకు వచ్చింది. తమ మరణానంతరం కొన ఊపిరిలోని సభ్య సమాజాన్ని కాపాడే బాధ్యతను గుర్తెరిగి.. అవయవ దానం క్రతువుకు పునాది పడింది. ఈ క్రతువు రోజు రోజుకూ విస్తరిస్తోంది. ఒక మనిషి బ్రెయిన్ డెత్‌తో కాలం చేస్తే.. క్షణాల్లో ఆ అయవాలను తరలించి మార్పిడి ప్రక్రియలో వైద్య రంగం అప్రతిహాత విజయపరంపరలో కదం తొక్కుతోంది. ఫలితంగా 2021లో తెలంగాణాలో 162 మంది అవయవ దాతలు ప్రాణదాతలుగా రికార్డు సృష్టిస్తే.. 2022 నాటికి అవయవదాతల సంఖ్య 194కు చేరింది. 154 మంది అవయవదాతలతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. అంతే కాదు, అవయవ దాతల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది.
అవయవ దానం.. మహా ప్రాణ దానం
భారత దేశంలో ఏటా లక్షలాది మంది వివిధ ప్రాణాంతక రుగ్మతలతో.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. వీరి ప్రాణాలను నిలపటానికి డాక్టర్ల శ్రమ వర్ణనాతీతం. ఇలాంటి తరుణంలో జీవన్ ధాన్ ఆశ్రితులకు ఓ వరంగా మారింది. అవయవదానం తెరమీదకు వచ్చింది. వ్యాధులతో గానీ, ప్రమాదాల వల్ల గానీ.. బ్రెయిన్ డెడ్ సంభవిస్తే. వెంటిలేటర్ బాధితుల అవయవాలు అచేతన స్థితికి చేరుతాయి. కుటుంబ సభ్యుల అనుమతితో బ్రెయిన్ డెడ్ వ్యక్తి అవయవాలను సేకరిస్తారు. ఇదే జీవన్ ధాన్.
2013లో తెలంగాణలో ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2013లో జీవన్ ధాన్ పారంభించింది. కేవలం నిమ్స్ లో అంకురించిన ఈ జీవన్ ధాన్ 26 కార్పొరేట్ ఆసుపత్రులకు విస్తరించింది. అవయవ సేకరణ, బదిలీ, మార్పిడికి అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. రూ.35 కోట్ల మేరకు నిధులను సమకూర్చింది. అంతే కాదు, అవయవాలను తక్షణమే తరలించేందుకు ప్రత్యేక చాపర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కార్నియా, కాలేయం, ఇలా ఒక వ్యక్తి నుంచి 8 అవయవాలను సేకరించి.. 8 మందికి పునర్జీవనం ప్రసాదించటం జీవన్ ధాన్ ధ్యేయం. ఇప్పటికే తెలంగాణ జీవన్ ధాన్ సైట్‌లో 1451 మంది అవయవ దాతలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 10 నుంచి 20 ఏళ్ల లోపు 103 మంది ఉన్నారు. 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు 285 మంది, 30 నుంచి 40 ఏళ్ల లోపు 253 మంది, 40 నుంచి 50 ఏళ్ల లోపు 285 మంది, అత్యధికంగా 50 ఏళ్ల పైనే దాతలు 517 మంది ఉన్నారు.
దాతల సంఖ్య పెరుగుతోంది
కరోనా మహమ్మారి తరువాత అవయవ దానాలపై ప్రజల్లో అవగాహన పెరిగింది. అంతే కాదు, అధునాతన పరిజ్ఞానం అందుబాటులోకి రావటంతో అవయదానం సులభతరమైంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, వెంటిలేటర్లు, ఈఎంసీవో మెషిన్‌లు తదితర అవకాశాలతో అవయవదానంలో కుటుంబ సభ్యులు వెనుకంజ వేయటం లేదు. అవయవదానంలో రెండేళ్ల కిందటే తమిళనాడును అధిగమించాం. ఈ ప్రక్రియను మరింత పటిష్ట పర్చటానికి ప్రయత్నిస్తున్నాం. జీవన్ ధాన్ వెబ్ సైట్లో దాతలు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. డాక్టర్ జి.స్వర్ణలత. ప్రోగ్రామ్ ఇన్ చార్జ్, తెలంగాణ జీవన్ ధాన్