Saturday, November 23, 2024

వైసీపీ ఖాతాలో కాకినాడ మేయర్ పదవి.. కొత్త మేయర్ ఎవరంటే..

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక పూర్తి అయింది. నగరపాలక సంస్ధ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ఎన్నిక జరిగింది. కాకినాడ మేయర్ గా 40వ వార్డు కార్పొరేటర్ సుంకర శివప్రసన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా మీసాల ఉదయ్ కుమార్ ఎన్నికయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాల మేరకు నేడు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ల పదవులకు ఎన్నికలు నిర్వహించారు. మేయర్‌ ఎన్నికకు టీడీపీ కార్పొరేటర్లు హాజరుకాలేదు.

కాకినాడ నగర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని మేయర్ సుంకర శివప్రసన్న అన్నారు. సహచర కార్పొరేటర్ల సహకారం ఎప్పటికప్పుడు తీసుకుంటానని చెప్పారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

2017లో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో 50 డివిజన్లకుగాను 48 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా.. టీడీపీ 32, వైసీపీ 10, బీజేపీ 3, ఇండిపెండెంట్లు 3 గెలుపొందారు. మేయర్ గా సుంకర పావని ఎన్నికైయ్యారు. ఇండిపెండెంట్‌లు అందరూ టీడీపీలో చేరారు. అయితే మేయర్‌ సుంకర పావని వ్యవహారశైలి నచ్చక కొందరు టీడీపీ కార్పొరేటర్లు విభేదించారు. ఈ క్రమంలో టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 33 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్‌అఫీసియో సభ్యులతో కలిపి మొత్తం 36 ఓట్లు వచ్చాయి. దీంతో పావని పదవిని కోల్పోయారు. మెజారిటీ కార్పోరేటర్లు అవిశ్వాసం మేరకు మేయర్, డిప్యూటీ మేయర్ లను తొలగించారు. అనంతరం ప్రభుత్వం ఈ నెల 12న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులకు నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించారు.

ఇది కూడా చదవండి: గులాబీ వేడుక.. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్!

Advertisement

తాజా వార్తలు

Advertisement