- మానసిక ఆందోళనలో యువతరం..
- ఆలోచనలను దూరం చేస్తున్న సెల్ ఫోన్ గేమ్స్..
- ప్రేమలు, చిన్న చిన్న తగాదాలతో మనస్తాపం.. ఏ చిన్న సమస్యను తట్టుకోలేని టెంపర్‌మెంట్
- పేరెంట్స్‌తో అటాచ్‌మెంట్ తగ్గడంతోనే సమస్య.. టీ-నేజ్‌లో పెరుగుతున్న ఆత్మహత్యలపై ఆందోళన
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుకలోే పరిచయం చేసుకున్నాడు. మాయమాటలు చెప్పి అభం శుభ తెలియని భాలికను ట్రాప్ చేశాడు. అతని మాటలు నమ్మిన ఆ మైనర్ ఇంట్లో నుంచి పారిపోయింది. దీంతో పరువు సమస్యగా భావించిన ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.
మహబూబాబాద్ జిల్లాలోని ఓ మండలానికి చెందిన తొమ్మిదేండ్ల బాలుడికి ఆన్‌లైన్ తరగతుల కోసం తండ్రి సెల్‌ఫోన్ కొనిచ్చాడు. అయితే ఫోన్‌తో బ్యాంక అకౌంట్ లింక చేసి.. వడ్లు అమ్మగా వచ్చిన 2 లక్షల రూపాయలను ఇంటర్‌నెట్ బ్యాంకింగ్‌తో తండ్రి అకౌంట్ నుంచి పోగొట్టాడు.
సూర్యాపేటలో ఈ మధ్యనే ఓ డిగ్రీ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. తల్లిదండ్రులు టెంపుల్‌కు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని టైమ్‌లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గుడి నుంచి వచ్చిన పేరెంట్స్ కొడుకు మతదేహం చూసి కన్నీరుమున్నీరయ్యారు.
రంగారెడ్డి జిల్లా మీర్‌పేట సర్వోదయ నగర్‌లో మరో ఘటన జరిగింది. తండ్రి మందలించాడని పదో తరగతి చదివే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మొబైల్ ఫోన్‌లో గేమ్స్ ఆడుతుంటే వద్దని వారించినందుకు మనోవేదనతో ప్రాణాలు తీసుకున్నాడు.
…ఇవే కాకుండా సెల్ఫీలు దిగుతూ ప్రమాదాలకు గురై చాలా మంది చనిపోతున్నారు. చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్య చేసుకుని.. తల్లిదండ్రులకు, అయినవారికి కడుపుకోత మిగుల్చుతున్నారు.
ప్రభ న్యూస్, హైదరాబాద్:
ప్రేమ విఫలం కావడం, కుటు-ంబ కలహాలు, విద్యలో రాణించకపోవడం, ఆర్థిక ఇబ్బందులు చుట్టు-ముట్టడం.. తదితర కారణాలతో ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారి సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం చూపక పోగా.. వారి పిల్లలు, కుటుంబ సభ్యులు అనాథలుగా మారుతున్నారు. ఒక్క క్షణం ఆలోచించగలిగితే ఆత్మహత్య ఆలోచనలను దూరం చేయవచ్చు. అన్ని సమస్యలకు సూసౌడ్ పరిష్కార మార్గం కాదు. పైగా తమవారిని, తమను నమ్ముకున్న వారిని మరింత కష్టాల్లోకి నెడుతుంది.
పెరిగిన యువత ఆత్మహత్యలు
ఆధునిక జీవన విధానంలో పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలు కొరవడటం, వారి కోసం సరైన సమయాన్ని వెచ్చించలేకపోవడం, పిల్లలు ఏమి చేస్తున్నారో పట్టించుకునే సమయం లేకపోవడంతో చాలామంది మానసిక సంఘర్షణకులోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో టీనేజ్, 18 నుంచి 29 సంవత్సరాల వయస్సు వారే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు క్రైం రికార్డుల ద్వారా వెల్లడవుతోంది. రోడ్డు యాక్సిడెంట్ల మరణాల తర్వాత రెండో స్థానంలో సూసైడ్స్ ఉంటున్నాయి. తాజాగా ఆన్‌లైన్‌కు బానిసలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న కేసులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నవెూదవుతున్నాయి.
సంకేతాలు తెలుసుకోవచ్చు..
ఆత్మహత్యకు పాల్పడాలనుకునే వారిని ముందుగా గుర్తించవచ్చంటున్నారు మానసిన నిపుణులు. డల్‌గా ఉండటం, ఇతరులతో కలవకపోవడం, ఏకాంతంగా గడపడం, ఆకలి, నిద్ర లేకపోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించక పోవడం.. విషాద భరితమైన సీరియల్స్ చూడటం, జోక్స వచ్చినా స్పందించక పోవడం వంటి లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు. అలాంటి వారు తమ మనస్సులోని బాధను ఎదుటి వారితో చెప్పుకోవడం ద్వారా కొంత ఉపశమనం కలుగుతుందంటున్నారు. ”నాకు చనిపోవాలని ఉంది.. ఈ జీవితం ఎందుకు.. ఏమీ సాధించలేక పోతున్నా” అని సన్నిహితుల వద్ద పదేపదే అనడం. ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ చెట్టుకు ఢకొీట్టడం వంటివి చేస్తుంటారని చెపుతున్నారు.
యువతలో సమస్యలు
గతంలో 40 సంవత్సరాల వయస్సు పైబడిన వారు ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడే వారు. కానీ, నేడు ప్రేమ విఫలమవడం.. చదువులో రాణించలేక పోవడం.. మానసిక ఒత్తిడి.. నవ దంపతుల్లో సర్ధుబాటు- సమస్యలు వంటి కారణాలతో యువతీ, యువకులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
మానసిక ఆందోళన
ఆత్మహత్య ఆలోచన.. ఒక మానసిక సమస్యే అంటున్నారు డాక్టర్లు. అట్లాంటి వారికి జీవితం విలువ తెలియజేయాలి. చనిపోయేందుకు దారికాదు… బతికేందుకు మార్గం చూపించాలంటున్నారు. స్టూడెంట్స్ సూసైడ్‌కు దారితీసే పరిస్థితులను అధిగమించేలా స్కూళ్లు, కాలేజీల్లో కౌన్సెలింగ్ సెంటర్ల వంటివి ఏర్పాటు చేస్తే మేలంటున్నారు మానసిక వైద్య నిపుణులు.
టీనేజ్‌లోనే ఫోన్‌కు బానిసలు
ఓ కుటుంబం హోటల్లో డిన్నర్‌కు వెళ్లింద నుకోండి. అక్కడ సహజంగా తల్లిదండ్రులు చేసే పని ఏంటంటే.. ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చే దాకా సెల్ ఫోన్లు తీసి చూసుకోవడం. అలాగే, పక్కనున్న పిల్లలకు కూడా ట్యాబ్‌లు ఇచ్చేస్తారు. అందులో ఓ వీడియోనో, లేకపోతే ఏదైనా గేమ్ ప్లే అవుతూ ఉంటుంది. కొన్ని సార్లు భోజనం చేసేటప్పుడు కూడా సెల్ ఫోన్‌ను పదే పదే చూస్తుంటారు. తినేటప్పుడు పిల్లల దగ్గరి నుంచి సెల్‌ఫోన్ తీసుకోవడానికి ట్రై చేస్తే.. వారు గోల గోల చేసేస్తారు. ఇది కచ్చితంగా తల్లిదండ్రులదే తప్పు. పిల్లలకు టైంపాస్ కావడానికి ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవ్వడంలో తల్లిదండ్రుల అలసత్వం ఉంది. (దాన్ని డిపెండెన్సీ సిండ్రోమ్ అంటారు) ఇది హోటల్‌కే పరిమితం కాదు.. చాలా మంది ఇండ్లలోనూ ఇదే పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది.