Friday, November 22, 2024

వ‌రుస భూకంపాలు ఆరు వేల మంది మృతి.. కొనసాగుతోన్న సహయకచర్యలు

వ‌రుస భూకంపాలు ట‌ర్కీ..సిరియా దేశాల‌ని అత‌లాకుత‌లం చేశాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఆరు వేల మంది మృతి చెందారు.. కాగా మ‌ర‌ణాల సంఖ్య మ‌రింత‌గా పెర‌గ‌నున్నాయ‌ని అక్క‌డి అధికారులు వెల్ల‌డించారు. భవనాలు కూలిపోవడంతో శిథిలాల క్రింద వేలమంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. గల్లంతు అయినవారిని గుర్తించేందుకు అధికారులు రెస్కూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మృతుల సంఖ్య 20 వేల వరకు చేరుకునే అవకాశం ఉందని డబ్లూ‌హెచ్‌వో తెలిపింది. ఇప్పటివరకు 18 వేల మంది గాయపడినట్లు గుర్తించగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఒక్క టర్కీ దేశంలోనే భూకంపం ప్రభావానికి 2,921 మంది చనిపోగా.. సిరియాలో 1,444 మంది మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం ఎంతమంది మరణించి ఉంటారనే దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మరణాల సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశముందని విదేశీ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ప్రపంచదేశాలు టర్కీ, సిరియాలకు అండగా నిలుస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ల కోసం తమ దేశాల నుంచి సిబ్బందిని తరలిస్తున్నాయి.

భారత్ ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు డాగ్ స్వాడ్, మెడికల్ టీమ్స్‌ను టర్కీ, సిరియాలకు పంపించింది. అధునాతన డ్రిల్లింగ్ యంత్రాలతో పాటు సహాయకచర్యలకు కావాల్సిన కీలకమైన పరికరాలను పంపింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌కాఫ్ట్‌లో పరికాలతో పాటు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది టర్కీ, సిరియాలకు వెళ్లారు. టర్కీ, సిరియాలకు భారత్ అండగా ఉంటుందని, అవసరమైన సహాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అవసరమైతే మరింత మంది సిబ్బందిని పంపిస్తామని భారత్ స్పష్టం చేసింది. సోమవారం ఉదయం 7.8, 7.6, 6.0 తీవ్రతతో వరుసగా మూడు విధ్వంసకర భూకంపాలు రావడంతో టర్కీ, సిరియా విలవిలలాడుతున్నాయి. మృతులకు ఇతర దేశాలు సంతాపం ప్రకటిస్తున్నాయి. 2021 ఆగస్టులో రిమోట్ సౌత్ అట్లాంటిక్‌లో సంభవించిన భూకంపం తర్వాత ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద భూకంపం ఇప్పుడు సిరియా, టర్కీలో నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. ఇళ్లు కూలిపోవడంతో చాలామంది నిరాశ్రయులుగా మారిపోయారు. శిధిలాలను తొలగించి మృతులను గుర్తించడానికి మరికొద్దిరోజులు సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ముగిసిన తర్వాత మృతుల సంఖ్య తేలే అవకాశముందని అంటున్నారు. 5600కిపైగా బిల్డింగ్‌లు రెండు దేశాల్లో తీవ్ర భూకంపం ప్రభావానికి కుల్పకూలినట్లు అధికారులు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement