బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను బుధవారం భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించే క్షిపణిని అండమాన్ నికోబార్‌లో పరీక్షించినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. మిస్సైల్ రేంజ్ పెరగ్గా.. ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని పేర్కొన్నారు. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ పరీక్ష విజయవంతమైనందుకు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆయన అండమాన్ నికోబార్ దీవుల్లోనే ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఇటీవల టెస్ట్ ఫైర్‌తో పాకిస్తాన్‌లోకి ఓ సూపర్ సోనిక్ మిస్సైల్ దూసుకెళ్లి పేలిపోయిన విషయం తెలిసిందే. దీనిపై ఎయిర్ వైస్ మార్షల్ సమగ్ర విచారణ జరుపుతున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి.
టెస్ట్ ఫైర్ మిస్ కావడంపై నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేస్తామని, ఆ తర్వాతే పూర్తి వివరాలు బయటకు వస్తాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనపై ఇప్పటికే భారత్ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు సైతం ఆదేశించినట్లు ఈ నెల 15న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ పార్లమెంట్‌కు తెలిపారు. భారత క్షిపణి వ్యవస్థ పూర్తిగా సురక్షితమైందని, భారత సాయుధ దళాలు వ్యవస్థలను పూర్తిగా నిర్వహించే సామర్థ్యంతో ఉన్నాయని స్పష్టం చేశారు. మిస్సైల్ మిస్‌ఫైర్‌పై పాక్ అంతర్జాతీయంగా లేవనెత్తేందుకు పాక్ ప్రయత్నిస్తున్నది.