Tuesday, November 26, 2024

Students Suicide: ప్రాణాలు తీసుకుంటున్న విద్యార్థులు.. తమిళనాడు ఏం జరుగుతోంది?

తమిళనాడు రాష్ట్రంలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒత్తిళ్లకు తట్టుకోలేక, మానసిక ఆందోళనలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.  కాగా, ఇప్పటి వేర్వేరు జిల్లాల్లో అయిదుగురు స్టూడెంట్స్​ ఆత్మహత్య చేసుకున్నారు. ఇట్లాంటి ఘటనలతో తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు కలవరపడుతున్నారు.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

24 గంటల వ్యవధిలోనే తమిళనాడులో మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శివగంగ జిల్లాలోని 12వ తరగతి చదువుతున్న బాలుడు తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను గణితం, జీవశాస్త్రం పాఠ్యాంశాల్లో వెనకబడి పోయానని, చదవలేకపోతున్నానని సూసైడ్ నోట్​లో పేర్కొన్నాడు. తమిళనాడులో 24 గంటల్లో ఇది రెండో కేసు కాగా, రెండు వారాల్లో అయిదో ఆత్మహత్యగా చెబుతున్నారు పోలీసులు. మంగళవారం తెల్లవారుజామున విరుదునగర్ జిల్లా శివకాశిలో 11వ తరగతి విద్యార్థిని కూడా తన ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. ఈ రెండు వారాల్లోనే విద్యార్థినులు, బాలికలు ఆత్మహత్యలకు పాల్పడడం మరింత ఆందోళన కలిగిస్తోంది.  

ఈ ఆత్మహత్యల ఘటనలపై విచారిస్తున్న పోలీసు అధికారి మాత్రం దీనిపై మాట్లాడడానికి నిరాకరించారు. ఈ కేసులు విచారణలో ఉన్నాయని, పూర్తయ్యే దాకా తామేమీ చెప్పలేమన్నారు.  తొలుత జులై 13న 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని హాస్టల్‌లో శవమై కనిపించింది. ఆమె కనియామూర్‌లోని శక్తి మెట్రిక్యులేషన్ పాఠశాల విద్యార్థి. ఇద్దరు స్కూల్ టీచర్లు చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు సూసైడ్ నోట్ రాసి చనిపోయింది.

కాగా, ప్రాథమిక శవపరీక్షలో ఆమె శరీరం చుట్టూ అనేక గాయాలు కనిపించాయి. ఆమె కుటుంబ సభ్యులు ఇది ఆత్మహత్య కేసుగా నమ్మడానికి నిరాకరించారు. మళ్లీ శవపరీక్ష చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మద్రాసు హైకోర్టు కూడా మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. కేసును విచారించిన జస్టిస్ ఎన్. సతీష్ కుమార్.. విద్యా సంస్థల్లో విద్యార్థుల మరణానికి సంబంధించిన అన్ని కేసులను దర్యాప్తు కోసం క్రైమ్ బ్రాంచ్ – క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ (CB-CID)కి బదిలీ చేయాలని ఆదేశించారు.

- Advertisement -

ఈ ఆత్మహత్యకు సంబంధించి పాఠశాల ప్రిన్సిపాల్‌తో సహా ఐదుగురిని అరెస్టు చేశారు. అయితే.. ఈ విద్యార్థిని ఆత్మహత్యపై తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళన, నిరసనలు జరిగాయి. హింసాత్మక ఘటనలు తలెత్తాయి. ఫలితంగా పోలీసు కాల్పులు కూడా జరిగాయి. పలువురు పోలీసు సిబ్బందికి కూడా గాయాలయ్యాయి.

కాగా, రెండో కేసు జులై 25న తన హాస్టల్ గదిలో మరో విద్యార్థిని శవమై కనిపించింది. ఆమె తిరువళ్లూరులోని సేక్రేడ్ హార్ట్ స్కూల్ విద్యార్థిని. ప్రభుత్వ-సహాయక బాలికల సీనియర్ సెకండరీ పాఠశాలలో చదువుతోంది. ఈ పాఠశాల అధికారుల అవకతవకలపై మృతురాలి తల్లిదండ్రులు నిరసన తెలిపారు.

ఇక.. తిరువళ్లూరు కేసు జరిగిన ఒక రోజు తర్వాత జులై 26న కడలూరు జిల్లాలోని తన ఇంట్లో మూడో విద్యార్థిని శవమై కనిపించింది. తను మానసిక ఒత్తిడికి గురైనట్టు వివరాలతో ఉన్న నాలుగు పేజీల సూసైడ్ నోట్ లభించింది. తమిళ పరీక్షలో బాగా స్కోర్ చేయలేకపోవడం, పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని ఆమె తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో ఆమె నిరాశకు లోనైనట్లు ఆ నోట్‌లో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement