మతం మార్చేందుకు తీవ్ర ఒత్తిడి చేయడంతో ప్లస్2 (12వ తరగతి) చదువుతున్న ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో జరిగింది. లావణ్య అనే స్టూడెంట్ని క్రైస్తవ మతంలోకి మారాలని ఒత్తిడి తేవడంతో తన జీవితాన్ని అంతం చేసుకుంది. కాగా, ఆమెను హాస్పిటల్ చేర్పించారు. అయితే ట్రీట్మెంట్కు ఆమె నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదని, చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు.
లావణ్య (17) తంజావూరులోని సెయింట్ మైకేల్స్ బాలికల వసతి గృహంలో ఉంటూ చదువుకుంటోంది. అయితే హాస్టల్ వార్డెన్ ఆమెను బాగా టార్చర్ పెట్టేవాడని, రోజూ హాస్టల్‌లోని గదులన్నీ శుభ్రం చేయాలని చెప్పేవాడని, దీనికి తను నిరాకరించడంతో తిట్టేవాడని లావణ్య సెల్ఫీ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి బలవంతం చేసినట్టు ఆ బాలిక ఆరోపించింది. ఈ ఘటనతో కలత చెందిన బాలిక పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. జనవరి 9వ తేదీన వాంతులు చేసుకోవడంతో పాటు తీవ్ర కడుపునొప్పి రావడంతో తన కూతురు ఆస్పత్రిలో చేరిందని అరియలూర్‌కు చెందిన లావణ్య తండ్రి మురుగానందం తెలిపాడు. మురుగానందం లావణ్యను తంజావూరు మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. స్పృహలోకి రాగానే తనకు ఎదురైన కష్టాలను వైద్యులకు చెప్పి ఆత్మహత్యకు ప్రయత్నించింది.
దీంతో వైద్యులు తిరుకట్టుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో లావణ్యను విచారించేందుకు పోలీసులు వచ్చారు. విచారణ ఆధారంగా బోర్డింగ్ స్కూల్ వార్డెన్ లావణ్యను వేధించాడని, ఆమెను క్రైస్తవ మతంలోకి మార్చమని బలవంతం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వార్డెన్ సకయమరి(62)ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన తిరుకట్టుపల్లి ప్రాంతంలో కలకలం రేపింది.