Tuesday, November 26, 2024

Web Series: స్ట్రేంజ‌ర్ థింగ్స్ సీజ‌న్ 4.. థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌కి ఇళ‌య‌రాజా సంగీతం!

‘స్ట్రేంజర్ థింగ్స్’.. పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతోమందిని ఆకట్టుకుంటున్న ఈ వెబ్ సీరిస్ 4వ సీజన్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఇది కేవలం ఇంగ్లిష్‌లోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీ భాష‌ల్లో కూడా రిలీజ్‌ కానుంది. అయితే.. ఈసారి ఇండియ‌న్స్‌కి అద్భుతమైన సర్‌ప్రైజ్‌ను సిద్ధం చేసింది ‘నెట్‌ఫ్లిక్స్’. ఈ సీరిస్‌కు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించనున్నారు. 4వ సీజన్‌లో వినిపించే థీమ్ మ్యూజిక్ సంగీత రారాజు ఇళయరాజా స్వరపరిచినదే. దీనికి సంబంధించిన ఒక శాంపిల్‌ను ‘నెట్‌ఫ్లిక్స్’ ఈ శుక్రవారం విడుదల చేసింది. ‘స్ట్రేంజర్ థింగ్స్’ వెబ్ సీరిస్ మొదలై దాదాపు ఆరేళ్లు కావస్తోంది.

ఈ సీరిస్‌లో సౌండ్ ట్రాక్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. 4వ సీజన్ మొదటి వాల్యూమ్ మే 27 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రెండో వాల్యూమ్ జూలై 1న విడుదల అవుతుంది. భారతీయ అభిమానులను ఆకట్టుకోవడం కోసం సీరిస్ నిర్మాతలు ఇళయరాజాను ఆశ్రయించారు. ఇందుకు ఆయన ఒకే చెప్పడమే కాదు, థ్రిలింగ్ మ్యూజిక్‌తో సర్‌ప్రైజ్ చేశారు. ‘స్ట్రేంజర్ థింగ్స్’ థీమ్‌కు ఏ మాత్రం తగ్గకుండా సంగీతాన్ని అందించారు. ‘స్ట్రేంజర్ థింగ్స్’ వంటి సీరిస్‌కు సంగీతం అందించడమంటే మాటలు కాదు. పైగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాధరణ పొందిన ఈ సీరిస్‌లో మెలోడీలకు అవకాశం ఉండదు. అంతా థ్రిల్లింగ్, సస్పెన్స్ సంగీతమే. కాబట్టి, ఇళయరాజా ఎలాంటి మ్యాజిక్ చేశారో చూడాలనే ఆసక్తి ఆయన అభిమానుల్లో పెరిగింది.

ఈ సీరిస్‌లోని 80వ దశకం నాటి సన్నివేశాలు ఉంటాయి. ఇందుకు ఇళయరాజా సంగీతం సరిగ్గా సరిపోతుంది. క్లాసికల్ ట్యూన్స్‌కు థ్రిల్లింగ్ సంగీతాన్ని అందిస్తే ఏ లెవల్‌ ఉంటుందో తెలియాలంటే ‘నెట్‌ఫ్లిక్స్’ పోస్ట్ చేసిన ఈ థీమ్ మ్యూజిక్ వీడియోను చూడాల్సిందే. ఇప్పటికే ఇళయరాజాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈ థీమ్ మ్యూజిక్‌తో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన మరింత అభిమానులను సంపాదించుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘స్ట్రేంజర్ థింగ్స్’లో వినోనా రైడర్, డేవిడ్ హార్బర్, మిల్లీ బాబీ బ్రౌన్, ఫిన్ వోల్ఫ్‌హార్డ్, గాటెన్ మటరాజో, కాలేబ్ మెక్‌లాఫ్లిన్, నోహ్ ష్నాప్, సాడీ సింక్, నటాలియా డయ్యర్, చార్లీ హీటన్, జో కీరీ, ప్రియహ్ హేర్గూ, బ్రెట్ హేర్గూ, బ్రెట్ జెల్‌మాన్, కారా బ్యూనో, మాథ్యూ మోడిన్ కీలక పాత్రల్లో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement