కెనడా: గర్భకోశంలో కాకుండా ఓ మహిళ కాలేయంలో పిండం ఎదుగుతుండటాన్ని కెనడా వైద్యులు గుర్తించారు. 33 ఏళ్ల మహిళ నెలసరి తప్పడం, తరచూ రక్తస్రావంతో బాధపడుతుండగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె కాలేయంలో పిండం ఎదుగుతున్న విషయాన్ని గమనించారు. ఈ అరుదైన, వింతైన పరిణామం గురించి కెనడాలోని మనిటోబా చిల్డ్రన్స్ హాస్పిటల్ రీసెర్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మనితోటొబాకు చెందిన వైద్యుడు మైఖేల్ నార్వే మీడియాకు వివరించారు.నెలసరి తప్పిన 45 రోజుల తరువాత 14 రోజులపాటు ఏకథాటిగా రక్తస్రావం అవుతూండటంతో డాక్టర్ నారేను ఆ మహిళ సంప్రదించడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. చివరకు ఆమె కాలేయంలో పిండం ఎదుగుతున్నట్లు గుర్తించారు. సాధారణంగా అండకోశంనుంచి వెలువడిన తరువాత వీర్యకణంతో కలసి పిండం ఏర్పడుతుందని, అక్కడినుంచి గర్భాశయంలోకి ఓ నాళం ద్వారా వెడుతుందని, కానీ చాలా అరుదైన సందర్భాల్లో అలా వెళ్లకుండా ఎక్కడో ఒక చోట ఉండిపోతూంటుందని అలాంటి కేసులను ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (గర్భకోశం వెలుపల గర్భం)గా పిలుస్తారని ఆయన చెప్పారు.
గర్భాశయ నాళం, లేదా ఉదరం, పొత్తి కడుపు గోడలు ఇలా వేరే ప్రాంతాల్లో పిండం ఇరుక్కుపోవడం కొత్తేమీ కాదని, కానీ కాలేయంలో పిండం ఎదగడం చాలా అరుదని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు ఇలా 14 మందిలో మాత్రమే గర్భకోశం వెలుపల, ప్రత్యేకించి కాలేయంలో పిండం ఎదగడం జరిగిందని ఈ తరహా కేసుల్లో నిపుణులైన మాయో క్లినిక్ వైద్యులు చెబుతున్నారు. 1964-1999 మధ్యకాలంలో మాత్రమే ఈ తరహా కేసులు వెలుగుచూశాయని కెనడాలోని నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ అధికారులు చెబుతున్నారు. ఆ మహిళ కాలేయంలో ఎదుగుతున్న పిండాన్ని శస్త్రచికిత్సతో తొలగించి, ఆమెను కాపాడామని, ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఆమె ఉన్నారని, ఇలాంటి కేసు తను తొలిసారిగా చూశానని ఆమెకు చికిత్స చేసిన డా.నారే వెల్లడించారు. సాధారణంగా గర్భం ఎలా ఏర్పడుతుందో, ఈ మహిళలో అసాధరణ గర్భం ఎలా ఏర్పడిందో వివరిస్తూ ఆయన విడుదల చేసిన వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఆంగ్ల పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో ఇది ఇప్పుడు సంచలనంగా మారింది.