Tuesday, November 26, 2024

Story : సికింద్రాబాద్..విశాఖ‌ల మ‌ధ్య వందేభార‌త్.. సక్సెస్ అయినట్టే.. !

భార‌తీయ రైల్వే వందేభార‌త్ ఎక్స్ ప్రెస్ ని నిర్వ‌హిస్తుంది. ఈ ట్రైన్ సెమీ..హై..స్పీడ్ తో ఉంటుంది.ఇక ఎల‌క్ర‌టిక్ మ‌ల్టిఫుల్ యూనిట్ రైలు ఈ వందేభార‌త్ ట్రైన్స్ . చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ని డిజైన్ చేసి తయారు చేసింది. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవ కింద మొదటి రైలు రూ.97 కోట్లతో 18 నెలల్లో తయారు చేశారు. ఈ అత్యాధునిక రైలును గతంలో ట్రైన్ 18 అని వ్యవహరించారు. ఆ తరువాత 2019 జనవరి 27న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తొలి రైలు 2019 ఫిబ్రవరి 15న ప్రారంభించబడింది. వందే భారత్ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.2023 జనవరి 15న సికింద్రాబాద్ – విశాఖపట్టణం వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు.

ఈ 8వ వందే భారత్ రైలు ఆదివారం మినహా వారంలో మిగతా ఆరు రోజులు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా 699 కిలోమీటర్ల దూరం కేవలం 8.30 గంటల్లో విశాఖపట్టణం చేరుకుంటుంది. తిరిగి 20 నిమిషాల విరామం తర్వాత సికింద్రాబాద్ కి బయలు దేరుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చే వందే భారత్‌ రైలు టికెట్ బుకింగ్స్ ప్రారంభమవ్వగా 2023 జనవరి 16 నుంచి ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో 14 ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు, 2 ఎగ్జిక్యూటీవ్ ఏసీ చైర్ కార్ కోచ్‌‌లు ఉంటాయి. మొత్తం 1,128 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలుగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకుంది వందే భారత్ ఎక్స్ ప్రెస్ . సంక్రాంతిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ రైలుకు ఆదరణ అంతకంతకు ఎక్కువ అవుతోంది.రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు తీసే ఈ వందే భారత్ కు ఆదరణ బాగుందన్న విషయాన్ని అధికారులు చెబుతున్నారు. 140 శాతానికి పైగా ఆక్యుపెన్సీ రేషియో నమోదు కావటంపై అధికారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 17 మధ్య కాలంలో మొత్తం 29 ట్రిప్పుల్లో రెండు వైపులా ట్రైన్లకు కలిపి ఇప్పటివరకు 44939 మంది ప్రయాణికులు ప్రయాణించారు.

సగటున చూస్తే.. సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ట్రైన్ లో ఒక ట్రిప్ నకు 1623 మంది ప్రయాణిస్తుంటే.. విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య పరుగులు తీసే వందే భారత్ లో ఒక్కో ట్రిప్ నకు సగటున 1550 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. స్టేషన్ల వారీగా చూస్తే సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ప్రయాణికుల సంఖ్యే అధికంగా ఉందని చెబుతున్నారు. సగటున సికింద్రాబాద్ నుంచి అధికంగా 1099 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటే.. విశాఖ నుంచి మాత్రం ఈ సంఖ్య 1049 మందిగా ఉంది. విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ట్రైన్ లో విజయవాదలో 341 మంది ప్రయాణికులు ఎక్కితే.. తిరిగి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్లే ట్రైన్ లో విజయవాడలో 297 మంది ప్రయాణికులు ఎక్కుతున్నారు.ఈ ట్రైన్ లో అతి తక్కువగా వరంగల్.. ఖమ్మం స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కుతున్నట్లుగా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. విశాఖ నుంచి కంటే సికింద్రాబాద్ నుంచి వెళ్లే వందే భారత్ లో ఎక్కువ మంది ప్రయాణం చేయటానికి కారణం.. టైమింగ్ కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.మొత్తానికి వందేభార‌త్ ట్రైన్స్ పై ప‌లు చోట్ల దాడులు జ‌ర‌గ‌గా..సికింద్రాబాద్..విశాఖ‌ల‌మ‌ధ్య న‌డుస్తోన్న వందేభార‌త్ కి రోజు రోజుకి ఆద‌ర‌ణ పెరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement