ప్రభాన్యూస్ బ్యూరో, ఉమ్మడి కరీంనగర్ : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల పరిధిలోని మొలంగూర్ గ్రామంలో కాకతీయుల కాలం నాటి ఖిల్లా ఉంది. దీనినే మొలంగూర్ ఖిల్లాగా పిలుస్తారు. చరిత్ర కలిగిన ఈ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేయడం లేదు. వరంగల్ నుండి కరీంనగర్ వరకు టూరిజం కారిడార్ గా మార్చి ఖిల్లాను అభివృద్ధి చేస్తామని మరిచారు. దీని చుట్టు ఉన్న గుట్టలు విధ్వంసానికి గురికాక ముందే కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఖిల్లా చరిత్రను పరిశీలిస్తే.. గుట్టపై సుబేదార్ అనే వ్యక్తి కోటా నిర్మించారని చరిత్ర చెబుతోంది. గుట్ట కింద దూదుబావి ఉండగా బావి నుంచి హైదరాబాద్ నిజాం నవాబుకు గుర్రాలపై నీటిని తీసుకెళ్లే వారని చెబుతారు.
గుట్టపై కోనేరు ఉండగా అందులో అన్ని కాలల్లో నీళ్లు నిల్వ ఉంటాయి. మొహర్రం రోజున గుట్ట కింద జాతర జరుగుతుంది. గుట్టను చూడడానికి పర్యటకులు విశేషంగా ఇక్కడికి వస్తుంటారు.13వ శతాబ్దంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు యొక్క సైన్యధికారి అలిగిరి మహరాజ్ అనే సంస్థానదీశుడు ఈ గుట్టను తన ఖిల్లాగా చేసుకొని ఇక్కడినుండే ఓరుగల్లును పరిపాలించేవాడని గ్రామస్తులు చెబుతారు. సుబేదార్ అనే వ్యక్తి గుట్టపై కోట నిర్మించాడని, గుట్ట కింద ఉన్న దూదుబావి నుంచి హైదరాబాదులో ఉన్న నిజాంకు గుర్రాలపై నీటిని తీసుకెళ్లేవారని చరిత్రకారుల అభిప్రాయం. కింద ఉన్న కోట నుండి గుర్రాలపై గుట్టపైకి వెళ్లడానికి వీలుగా రాతిబాటను కూడా నిర్మించారు.ప్రాచీనకాలంనాటి నిర్మాణ నైపణ్యంతో ఈ కోటను అద్భుతంగా నిర్మించారు. ఇక్కడ దూద్ బావి, పురాతన శివాలయం, సెయింట్ మలాంగ్ షా వాలి సమాధి ఉంది. దూద్ బావిలో ఉన్న పాలవంటి నీటికి గొప్ప ఔషధ విలువలు ఉండి అనేక వ్యాధులను నయం చేసేవని, మదుంగ్ షా వాలి యొక్క సమాధి కారణంగా దీనికి మోలాంగూర్ పేరు వచ్చిందని చెబుతారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..