అంతా ఊహించినట్టే మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఖర్గే గెలుపుతో దాదాపు 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ పగ్గాలు గాంధీ కుటుంబేతర వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయి. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజ్యసభలో ఆ పార్టీ నేత ఖర్గే ఘనవిజయం సాధించారు. దేశంలో స్వాతంత్య్ర సంగ్రామానికి ముందుగానే ఉద్భవించిన కాంగ్రెస్ పార్టీకి.. 137 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే.. సుదీర్ఘ కాలం పాటు.. ఈ పార్టీని నడిపించింది మాత్రం గాంధీల కుటుంబమే. మధ్యలో కొందరు పగ్గాలు చేపట్టారు. వారంతా అగ్ర సామాజిక వర్గాలకు చెందిన వారే కావడం గమనార్హం. కానీ తొలిసారి.. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో .. ఒక దళిత నాయకుడు.. సుమారు 55 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న నేత.. కర్ణాటకకు చెందిన 86 ఏళ్ల మల్లికార్జున ఖర్గే ఘన విజయం సాధించడం గమనార్హం.
కాగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సుదీర్ఘకాలం తర్వాత ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల్లో సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే ఘన విజయం సాధించారు..అధ్యక్ష పదవికి అక్టోబరు 17న ఎన్నికలు నిర్వహించారు. అక్టోబర్ 19న బుధవారం ఫలితాలను వెల్లడించారు. ఈ ఎన్నికల్లో 9500లకు పైగా ఓట్లు పోలవ్వగా.. ఖర్గేకు 7వేలపైగా ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి శశిథరూర్ కి కేవలం 1072 ఓట్లు పోలయ్యాయి.కాగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టడానికి విముఖత చూపిన సంగతి తెలిసిందే. మొదట కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గాంధీల విశ్వాసపాత్రుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేరు బాగా వినబడింది. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి గెహ్లాట్ ఒప్పుకోలేదు. దీంతో ఆయన తప్పుకున్నారు.దీంతో కాంగ్రెస్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి కేంద్ర మాజీ మంత్రులు మల్లిఖార్జున ఖర్గే ..శశి థరూర్లు పోటీ చేశారు. కాగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ మద్దతుతోపాటు దేశంలో మెజారిటీ పీసీసీల మద్దతు ఖర్గేకే ఉందని ముందే వార్తలు వచ్చాయి.
అయితే విజయం సాధించినంత ఈజీ కాదు కాంగ్రెస్ పార్టీని నడిపించడం. మల్లికార్జున ఖర్గే ఐదేళ్ల పాటు పార్టీని నడిపించాల్సి ఉంది. ఈ ఐదేళ్లలో ఆయనకు అనేక సవాళ్లు ఎదురు కానున్నాయి. పార్టీని 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ప్రధాని పీఠం వరకు తీసుకువెళ్లగలరా.. అత్యంతకీలకమైన అసంతృప్త వాదులు.. గ్రూప్-23(జీ-23) నేతలను ఆయన సంతృప్తి పరచగలరా అనేది.. ఇప్పుడున్న సవాల్. వీటికిమించి.. ప్రధాని నరేంద్ర మోడీ ఎత్తులు.. బీజేపీ.. ఆర్ ఎస్ఎస్ పై ఎత్తులను అధిగమించడం.. 86 ఏళ్ల ఖర్గేకు అంత ఈజీ అయితే.. కాదనేది విశ్లేషకుల మాట. 2014 తర్వాత క్రమ క్రమంగా బలహీనపడిన కాంగ్రెస్ ని అనేక సమస్యలు చుట్టుముట్టాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ చతికిలపడింది. ఏ ఎన్నికల్లోనూ పెద్దగా రాణించడం లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవంతో లోక్ సభలో ప్రతిపక్ష హోదా సైతం కోల్పోయింది.
ఈ నేపథ్యంలో పార్టీ తదుపరి అధ్యక్షుడికి అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. వాటిని ఖర్గే ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ కి ప్రధాన సమస్యలు ఏంటో చూద్దాం.. దేశవ్యాప్తంగా పార్టీకి పునరుజ్జీవం పోయాలి.. బలమైన ప్రత్యర్థి బీజేపీని ఎదుర్కోవాలి..2024 లోక్ సభకి ఎన్నికలకు సన్నద్ధం కావాలి..జీ23 నాయకులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలి..త్వరలో జరగబోయే గుజరాత్.. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలి..ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజస్థాన్.. ఛత్తీస్ గడ్ ని కాపాడుకోవాలి..వచ్చే ఏడాదిన్నర కాలంలో 11 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ సత్తా చాటేలా పార్టీని నడిపించాలి. మరి ఇన్ని సమస్యలన్ని ఖర్గే ఏ విధంగా అధిగమిస్తారో రానున్న రోజుల్లో చూడాలి.