వినాయకచవితికి పెట్టింది పేరు హైదరాబాద్. ముంబయి తర్వాత వినాయకచవితిని చేయడంలో హైదరాబాద్ తర్వాతి స్థానంలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. కాగా ప్రతి ఏటా వినాయకచవితిని ఘనంగా నిర్వహిస్తుంటారు హైదరాబాద్ వాసులు. అందులో భాగంగా ప్రతి ఏటా ఖైరతాబాద్ లో అతి పెద్ద విగ్రహాన్ని పెడుతుంటారు.వినాయకచవితి వచ్చిందంటే చాలు నగరంలో ఎక్కడ లేని సందడి షూరూ అవుతుంది. విభిన్న రూపాల్లో గణనాధులు, పళ్లు, పూజకు అవసరమైన వస్తువులతో రోడ్లన్ని నిండిపోతాయి. వినాయకచవితికి ఒక రోజు ముందే గణేష్ మండపాలకు తరలివెళ్లి గణనాధులు, గణపతిబప్ప మోరియా అనే నినాదాలతో హైదరాబాద్ నగరం మొత్తం మారుమోగిపోతుందన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ప్రతి గల్లీ గల్లీలో భారీ భారీ విగ్రహాలు నెలకొల్పి..డీజేలతో మోత మోగిస్తుంటారు యూత్. నిత్యం అన్నదానాలు..ఎంటర్ టైన్ మెంట్ తో దుమ్ము రేపుతుంటారు.
అంతేనా లడ్డూ వేలం పాటలు ఇలా ప్రతీది సంప్రదాయబద్దంగా.. ఎంతో ఘనంగా జరుగుతుంటాయి ఈ వేడుకలు.ఇక ఉత్సవాలు ముగిసిన అనంతరం నిమజ్జనాలు కూడా అంతే ఘనంగా నిర్వహిస్తుంటారు భక్తులు. హుస్సేన్ సాగర్‌తో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని 50కి పైగా సరస్సులు ఉన్నాయి. ఇక కృత్రిమ చెరువుల్లో 40 వేలకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటారు. కాగా ఈ ఏడాది 2023లో ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి 61 అడుగుల ఎత్తైన విగ్రహం రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారట. కాగా నిర్జల్ ఏకాదశిని పురస్కరించుకుని విగ్రహ ఏర్పాటు మండపం వద్ద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ పి.విజయారెడ్డితో కలిసి వేదమంత్రాల నడుమ తొలిపూజ (కర్రపూజ) నిర్వహించారు. అనంతరం ఉత్సవ నిర్వాహకులు రాజ్‌కుమార్, సందీప్ తదితరులు మాట్లాడుతూ.. గతేడాదిలానే ఈసారి కూడా మట్టి విగ్రహాన్నే ప్రతిష్ఠించనున్నట్టు తెలిపారు. గణేశ్ చవితికి మూడు రోజుల ముందుగానే విగ్రహ నిర్మాణం పూర్తవుతుందన్నారు. వారం పది రోజుల్లో పనులు ప్రారంభిస్తామని, ఆ తర్వాత విగ్రహ నమూనాను ప్రకటిస్తామని తెలిపారు.