పెళ్లి ఈ పదానికి చాలా పవిత్రత ఉంది. మూడు ముళ్లు..ఏడడుగులు మేళతాళాలు.. ఇవన్నీ భారతీయులు పక్కాగా పాటించే ఆచారాలు అనే చెప్పాలి. అయితే ఈ మధ్యకాలంలో పాశ్య్చాత పోకడలకి పోతున్నారు పలువురు. దాంతో వివాహబంధానికి గుడ్ బై చెప్పి ఇండివిజువల్ లైఫ్ కి అలవాటు పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. అయితే వివాహబంధానికి విలువ ఇవ్వడం..కుటుంబ వ్యవస్థని కాపాడుకోవడంలో ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంది భారత్. ఈ మేరకు వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటాని రీలీజ్ చేసింది భారతదేశంలో విడాకుల కేసులు ఒక శాతంగా మాత్రమే ఉన్నాయి. మరోవైపు ప్రపంచంలో 94 శాతం వరకు వివాహ సంబంధాలు విచ్చిన్నమవుతున్నదేశం కూడా ఉంది. ఈ డేటా ప్రకారం.. ఆసియా దేశాలలో సంబంధాలు చాలా తక్కువగా విచ్ఛిన్నమవుతాయి. ఐరోపా, అమెరికాలో కుటుంబాలు ఎక్కువగా విచ్ఛిన్నమవుతున్నాయి.విడాకుల సంఖ్య తక్కువగా ఉన్న దేశాలను పరిశీలిస్తే.. భారత్ తర్వాత వియత్నంలో ఈ సంఖ్య 7 శాతంగా ఉంది. తజికిస్థాన్‌లో 10 శాతం, ఇరాన్‌లో 14 , మెక్సికోలో 17 శాతం దంపతులు విడాకులు తీసుకుంటున్నారు. ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, టర్కీ, కొలంబియా కూడా అతి తక్కువ సంఖ్యలో విడాకులు తీసుకున్న 10 దేశాలలో ఉన్నాయి.
జపాన్‌లో విడాకులు తీసుకుంటున్నవారి సంఖ్య 35 శాతంగా ఉంది. జర్మనీలో 38 శాతం సంబంధాలు విచ్ఛిన్నం అవుతుండగా.. బ్రిటన్‌లో ఈ సంఖ్య 41 శాతంగా ఉంది. చైనాలో 44 శాతం వివాహాలు విడాకులతో ముగుస్తుండగా.. ఈ సంఖ్య అమెరికాలో 45 శాతం, డెన్మార్క్‌లో 46 శాతం , దక్షిణ కొరియాలో 46 శాతం , ఇటలీలలో 46 శాతంగా ఉన్నాయి. భారత పొరుగు దేశం పాకిస్తాన్‌ను ఈ నివేదికలో చేర్చలేదు. అత్యధికంగా దాంపత్య బంధాలు విచ్ఛిన్నమవుతున్న దేశాల విషయానికి వస్తే.. పోర్చుగల్‌లో 94 శాతం విడాకుల కేసులు నమోదవుతున్నాయి. ఈ జాబితాలో స్పెయిన్ చివరి నుండి రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ 85 శాతం సంబంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. లక్సెంబర్గ్‌లో 79 శాతం బంధాలు విడాకులతో ముగుస్తున్నాయి. రష్యాలో కూడా 73 శాతం, ఉక్రెయిన్‌లో 70 శాతం వివాహాలు విడాకులతో ముగుస్తున్నాయి. ప్రపంచంలోనే విడాకుల కేసులు భారతదేశంలోనే తక్కువగా నమోదు కావడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. భారతదేశంలో సుదీర్ఘ సంబంధాలకు కారణం సాంస్కృతిక అంశాలు, కుటుంబ వ్యవస్థ ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పెద్ద సంఖ్యలో విడాకుల కేసులు చట్టపరమైన ప్రక్రియ ద్వారా కావడం లేదు. పలు సందర్భాల్లో భార్యాభర్తలు విడివిడిగా జీవించడం ప్రారంభిస్తున్నారు. దీని కారణంగా.. వాస్తవంగా భారత్‌లో విడాకుల కేసులకు సంబంధించిన గణంకాల్లో కచ్చితత్వం లేదు. అయితే వీటిని పరిగణలోకి తీసుకున్నప్పటికీ.. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో విడాకుల కేసులు చాలా తక్కువ.