Thursday, November 21, 2024

Story : ఇట‌లీకి తొలి మ‌హిళా ప్ర‌ధానిగా జార్జియా మెలోని-చ‌రిత్ర పుస్త‌కాల్లో చోటు

ఇటలీకి తొలి మ‌హిళా ప్ర‌ధానిగా ఎన్నిక‌య్యారు జార్జియా మెలోని. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ ప్రధాని గద్దెను అధిష్ఠించిన తొలి ప్రధానిగా ఆమె చరిత్ర పుస్తకాల్లో చోటు సంపాదించుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ 25 శాతం ఓట్లతో విజయం సాధించింది. జార్జియా పుట్టిన తర్వాత ఆమె తల్లిని తండ్రి విడిచిపెట్టి వెళ్లిపోయాడు. దీంతో ఆమెను తల్లి ఒంటరిగానే పెంచి పెద్ద చేసింది. 15 ఏళ్ల వయసులో ఫాసిస్ట్ నియంత బెనిటో ముస్సోలినీ మద్దతుదారులు స్థాపించిన ‘ఇటాలియన్ సోషల్ మూవ్‌మెంట్’ (ఎంఎస్ఐ) స్థానిక యువజన విభాగంలో జార్జియా చేరారు. 1990 సంవత్సరం మధ్యలో నేషనల్ అలయెన్స్ (ఏఎన్)లో ఎంఎస్ఐ భాగమైంది. ఆ తర్వాత మాజీ ప్రధాని సిల్వియో బెర్లస్కోనీ స్థాపించిన ప్రధాన కన్జర్వేటివ్ గ్రూపులో విలీనమైంది. 2012లో ఏఎన్ నుంచి బయటకు వచ్చిన మెలోనీ, మరికొందరు సభ్యులు ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ పార్టీని స్థాపించారు. ఇటలీ జాతీయ గీతంలోని తొలి పంక్తినే ఈ పార్టీకి పేరుగా పెట్టారు.

ఓ ఇంటర్వ్యూలో మెలోని మాట్లాడుతూ.. తన పార్టీని యూఎస్ రిపబ్లికన్ పార్టీ, బ్రిటన్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీతో పోల్చారు. తన పార్టీ దేశభక్తికి, కుటుంబ సంప్రదాయ విలువలకు ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. కాగా మెలోనీ 21 ఏళ్ల వయసులో తొలి ఎన్నికల్లో విజయం సాధించి అధికారికంగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2008లో బెర్లుస్కోని ప్రభుత్వంలో మంత్రి (యూత్ పోర్టుఫోలియో)గా పనిచేసి 31 ఏళ్ల అతి పిన్న వయసులో ఆ ఘనత సాధించిన మహిళగా రికార్డులకెక్కారు. 2019లో జార్జియా చేసిన ప్రసంగం మద్దతుదారుల్లో ఉత్సాహాన్ని నింపింది. ‘‘నేను జార్జియా. నేను స్త్రీని. నేను తల్లిని. నేను ఇటాలియన్‌ను. నేను క్రిస్టియన్. వీటిని నా నుండి ఎవరూ తీసివేయలేరు’’ అంటూ ఆమె చేసిన ప్రసంగం యువతను ఉర్రూతలూగించింది. జూన్‌లో ఇచ్చిన మరో ప్రసంగంలో ఆమె సంప్రదాయ కుటుంబాలకు మద్దతు ప్రకటించారు. లైంగిక గుర్తింపు, ఎల్జీబీటీ లాబీని తీవ్రంగా వ్యతిరేకించారు. లింగపరమైన గుర్తింపునకు ఓకే కానీ, జెండర్ భావజాలానికి తాను వ్యతిరేకమని బల్లగుద్ది మరీ చెప్పారు. మన ప్రజల కోసం పనిచేయాలని, అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థల కోసం కాదని జార్జియా తేల్చి చెప్పారు. ఇప్పుడు ఈమె పేరు మారుమ్రోగిపోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement