టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో శాటిలైట్..డీటీహెచ్ లు విపరీతంగా ప్రేక్షకులకి వినోదాన్ని అందిస్తున్నాయి. కానీ అప్పట్లో వినోదం ఎలా అంటే..టీవీలు ఉన్నా వాటికి యాంటినాలే ప్రాణంగా నిలిచాయి. అప్పట్లో వినోదం అందించేంది ఏ ఛానల్ తెలుసా..దూరదర్శన్..నేటి తరానికి దూరదర్శన్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు..నాటి తరం వారికి వారాంతపు రోజుల్లో శనివారం తెలుగు సినిమా, ఆదివారం హిందీ సినిమా, ప్రతి బుధవారం చిత్రలహరి, వ్యవసాయ కార్యక్రమాలు, డాక్యుమెంటరీ ఫిల్ములు, వార్తలు… ఇలాంటి కార్యక్రమాలతో దూరదర్శన్ జాతీయస్థాయిలో అభిమానులను సంపాదించుకుంది. తర్వాత కాలంలో దూరదర్శన్ ప్రాంతీయ చానళ్లు కూడా వచ్చాయి.
ఇప్పుడవన్నీ ప్రసారాలు కొనసాగిస్తున్నా, గతంతో పోల్చితే వాటి ప్రేక్షకుల సంఖ్య బాగా తగ్గింది. అందుకు కారణం ప్రైవేటు వినోద చానళ్లు రావడమే. ఎన్ని ప్రైవేటు ఛానళ్లు ఉన్నా కూడా వాటి పోటీని తట్టుకుని మరీ దూరదర్శన్ మనుగడ సాగిస్తోంది. కాగా నేడు దూరదర్శన్ పుట్టినరోజు. 1959 సెప్టెంబరు 15న ఈ ఛానల్ ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. దూరదర్శన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా ఉన్న దూరదర్శన్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్దాల తరబడి ప్రజలకు సేవలు అందిస్తున్న దూరదర్శన్ మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. దూరదర్శన్ భాండాగారంలో భద్రపరిచిన అనేక కథనాలు, కార్యక్రమాలు భారతదేశ సుసంపన్న చరిత్రకు తరగని నిధి అని అభివర్ణించారు.