ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్స్ ని కలవరపెడుతోన్న విషయం ఏంటంటే ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ తో పరిచయం.
రూ. 200 కోట్ల స్కామ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్ చిక్కుకున్నాడు. ఇతగాడిని ఈడీ విచారిస్తుంది. ఈ దర్యాప్తులో భాగంగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహీలను ఇప్పటికే ఈడీ ప్రశ్నించింది. వీరితోపాటు నికితా తంబోలీ, చాహత్ ఖన్నా, సోఫియా సింగ్, అరుష పాటిల్‌లూ సుకేశ్ చంద్రశేఖర్ కనెక్షన్‌లోకి వెళ్లారు. అసలు వీరు ఆ మాయగాడి ఉచ్చులో ఎలా పడ్డారు. వీరిని ఒక చోట చేర్చిన ఆ తెర వెనుక మనిషి ఎవరు.. సుకేశ్ చంద్రశేఖర్ ఎలా ప్రముఖ హీరోయిన్లను కలుసుకోగలిగారు తెలుసుకుందాం..
పింకీ అనే ఇరానీ మహిళ సుకేశ్ చంద్రశేఖర్ కు హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ని పరిచయం చేసిందట.కాగా పింకీ ఇరానీ సహాయతోనే సుకేశ్ చంద్రశేఖర్.. యాక్టర్లను జైలులో కలుసుకోగలిగాడు. వారికి ఖరీదైన బహుమతులు అందించగలిగాడు. చంద్రశేఖర్ తరఫున ఆమెనే ఆ బహుమానాలు ఇచ్చేదట. సుకేశ్ చంద్రశేఖర్ తప్పుడు ఐడెంటిటీతో జాక్వెలిన్‌తో పరిచయం చేసుకున్నాడు. తాను సన్ టీవీ యజమాని అని, జయలలిత కుటుంబానికి చెందినవాడని తనతో పరిచయం చేసుకున్నట్టు జాక్వెలిన్ ఈడీకి వెల్లడించింది. 2020 డిసెంబర్, 2021 జనవరి మధ్య కాలంలో తనతో టచ్‌లోకి రావడానికి సుకేశ్ చంద్రశేఖర్ ప్రయత్నించాడంది. ఆయన కాల్స్‌కు ఆమె రెస్పాండ్ కాలేదని… ప్రభుత్వ కార్యాలయం నుంచి కూడా ఒకరు తనతో కాంటాక్ట్ అయ్యారని, సుకేశ్‌తో టచ్‌లోకి రావాలని చెప్పారంది. 2021 అక్టోబర్‌లో సుకేశ్ లాయర్ అనంత్ మాలిక్ మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. సుకేశ్, జాక్వెలిన్‌లు డేటింగ్ చేస్తున్నారని చెప్పారు. ఆ వ్యాఖ్యలను ఆమె ఖండించారు.
ఆ తర్వాత వారిద్దరూ క్లోజ్‌గా ఉన్న కొన్ని ఫొటోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయ్యాయి.ఇదే కేసులో ఢిల్లీ పోలీసులు నోరా ఫతేహీని ఆరు గంటలపాటు ప్రశ్నించారు. 2020 డిసెంబర్‌లో చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరు కావడంపై ఆమెను ప్రశ్నించారు. అది తన ఏజెన్సీ ఎక్సీడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా బుక్ అయిందని వివరించారు. ఆ ఈవెంట్‌లో తాను సుకేశ్ భార్య లీనా మేరియా పాల్‌ను కలిసిందని చెప్పింది. అప్పుడే ఆమె తనకు గుచ్చి బ్యాగ్, ఐఫోన్ ఇచ్చారంది. సుకేశ్ తనకు పెద్ద ఫ్యాన్ అని లీనా చెప్పిందని వెల్లడించింది. సుకేశ్ తనను కలువడం కుదరదని వివరించింది. అందుకే లీనా ఫోన్‌లో స్పీకర్ పెట్టి ఇద్దరితో మాట్లాడించారట. ఆయన తనకు థాంక్స్ చెప్పారని, ఆయన తనకు పెద్ద అభిమానిని అని వివరించారని నోరా ఫతేహీ తెలిపింది. ఆ తర్వాత లీనా తనకు కొత్త బీఎండబ్ల్యూ కారును అభిమానంగా బహుమానం చేస్తున్నట్టు ప్రకటించిదని, కానీ తనకు అప్పటికే ఒక బీఎండబ్ల్యూ కారు ఉన్నదని తిరస్కరించానని వివరించింది.
నలుగురు చిన్ననటులు, మోడల్స్ నికితా తంబోలీ, చాహత్ ఖన్నా, సోఫియా సింగ్, అరుష పాటిల్‌లు సుకేశ్ చంద్రశేఖర్‌ను ఢిల్లీ జైలులో ఉన్నప్పుడు కలుసుకున్నారని ఇండియా టుడే ఓ కథనంలో పేర్కొంది. తీహార్ జైలులో అతన్ని కలుసుకోవడానికి వీళ్లు పింకి ఇరానీ ద్వారా వెళ్లారు. వేర్వేరు పేర్లతో వారికి సుకేశ్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. సుకేశ్‌ను కలువడానికి వచ్చినందుకు వారికి డబ్బులు, గిఫ్టులు ఇచ్చారు. ఈ నలుగురిలో అరుష పాటిల్ మాత్రమే పింకీ ఇరానీ ద్వారా సుకేశ్ చంద్రశేఖర్‌ను కలిశానని అంగీకరించారు. జైలులో కాదని పేర్కొన్నారు. అందులో ఎక్కువ మందికి శేఖర్ అనే పేరుతో సుకేశ్ పరిచయం చేసుకున్నాడు. ఇండస్ట్రీలో తాను పెద్ద వ్యక్తినని చెప్పుకుతిరేగేవాడు. ఎట్టకేలకు పాపం పండింది. ఈయనతో పరిచయాలు ఉన్నవారు చిక్కుల్లో పడ్డారు. ఈ మేరకు ఈడీ అధికారులకు అన్ని విషయాలను ఓపెన్ గా చెబుతున్నారు పలువురు హీరోయిన్స్. మరి ఈ కేసు ఎంతదూరం వెళ్తుందో చూడాలి.