దేశంలోని ప్రాంతీయ భాషల రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నాలు ఆపాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన ఆదివారం ఒక లేఖ రాశారు. హిందీ మాట్లాడే రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రాంతీయ భాషలున్న రాష్ట్రాల్లోనూ ఐఐటీల వంటి సాంకేతిక, నాన్-టెక్నికల్ ఉన్నత విద్యా సంస్థలలో బోధనా మాధ్యమం హిందీలో ఉండాలని పార్లమెంటరీ ప్యానెల్ ఈ మధ్య సిఫార్సు చేసింది. ఐక్యరాజ్యసమితి అధికారిక భాషల్లో కూడా హిందీ ఒకటిగా ఉండాలని ఆ ప్యానెల్ సూచించింది.
ఈ నేపథ్యంలో హిందీని ప్రధానంగా వ్యతిరేకించే తమిళనాడు రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో ఇంగ్లిష్, తమిళంతో సహా 22 భాషలను పేర్కొన్న సంగతిని ఆయన గుర్తు చేశారు. మరిన్ని ప్రాంతీయ భాషలను ఈ జాబితాలో చేర్చాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయన్నారు. హిందీ మాట్లాడే వారి కంటే హిందీయేతర భాషలు మాట్లాడేవారి సంఖ్య దేశంలో ఎక్కువగా ఉందని తెలిపారు. ప్రతి భాషకు దాని ప్రత్యేకతతోపాటు భాషా సంస్కృతి కూడా ఉందని స్టాలిన్ గుర్తు చేశారు.
ఇక.. అన్ని మార్గాల ద్వారా హిందీని బలవంతంగా రుద్దడానికి కేంద్ర ప్రభుత్వం దూకుడు యత్నాలు చేస్తున్నదని సీఎం స్టాలిన్ ఆరోపించారు. హిందీయేతర రాష్ట్రాలలో సహేతుకమైన భయం, అసంతృప్తిని కలిగిస్తున్నదని తెలిపారు. ఈ చర్యలు రాజ్యాంగంలోని సమాఖ్య సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇలాంటి విభజన ప్రయత్నాలు హిందీయేతర రాష్ట్రాల ప్రజలను ప్రతికూల స్థితిలో ఉంచుతాయని, కేంద్రం- రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాల స్ఫూర్తిని దెబ్బతీస్తాయని హెచ్చరించారు. అందువల్ల 8వ షెడ్యూల్‌లోని అన్ని భాషలను అధికారిక భాషలుగా చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే దేశ తొలి ప్రధాని నెహ్రూ ఇచ్చిన హామీని కూడా సీఎం స్టాలిన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.