బతికున్న కోళ్లు, బాతులను ముట్టుకోవద్దని వాటి నుంచి ఇన్ఫెక్షన్ సోకుతోందని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) హెచ్చరించింది. కోళ్లు, బాతుల నుంచి సంక్రమించే సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్లు అమెరికాలో పెరుగుతున్నాయి. 43 రాష్ట్రాల్లో 163 సాల్మొనెల్లా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజారోగ్య అధికారులు, సీడీసీ దీనిపై దృష్టి సారించింది. ఇంటి వెనుక పౌల్ట్రీలు ఉండేవారికి ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా సోకినట్లు వారి పరిశీలనలో తేలింది. కోళ్లు, బాతులు చూడటానికి ఆరోగ్యంగా కనిపించినప్పటికీ, వాటి నుంచి బ్యాక్టీరియా వ్యాపించే ముప్పుందని సీడీసీ వెల్లడించింది. ముఖ్యంగా అవి ఉన్న ప్రాంతాల్లో తిరిగేవారికి ఈ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం అధికంగా ఉందని తెలిపింది.
ఈ ఇన్ఫెక్షన్ సోకితే డయేరియా, కడుపు నొప్పి, వాంతులు , విరేచణాలు, జ్వరం తదితర లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇన్ఫెక్షన్ బారిన పడ్డ కొందరు రోగులు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండానే.. కోలుకుంటారు. కానీ అశ్రద్ద చేస్తే మాత్రం ప్రాణాలకు కూడా ముప్పు ఉందని అధికారులు చెబుతున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో మూడోవంతు ఐదేళ్లలోపు వారికే ఇన్ఫెక్షన్ సోకిందని సీడీసీ తెలిపింది. ఫిబ్రవరి రెండో వారం నుంచి ఈ ఇన్ఫెక్షన్తో 34 మంది ఆసుపత్రుల్లో చేరారు. అయితే వారిలో ఎవరూ చనిపోలేదు. చిన్నపిల్లలకి ఈ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా సోకుతున్నందున.. పక్షుల నుంచి పిల్లల్ని దూరంగా ఉంచాలని సీడీసీ సూచించింది. సరిగా వండని మాంసం, గుడ్లు, బతికున్న పక్షుల్లో ఈ సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుందని.. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.