హైదరాబాద్, ఆంధ్రప్రభ : నకిలీ విత్తన తయారీదారులపై ఉక్కుపాదం మోపాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదిలేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. ప్రధానంగా పత్తి, మిరప విత్తనాలలో నకిలీ విత్తన సమస్య తీవ్రంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తక్కువ ధరకు విత్తనాలు లభిస్తుండడం మూలంగానే రైతులు నకిలీ విత్తనాల వైపు మొగ్గుచూపుతున్నారని తెలిపారు. సాగులో ఉండే కలుపు సమస్యను ఎదుర్కోవడానికి గడ్డి మందు కొట్టేందుకు అవకాశం ఉండడంతో కలుపుకూళ్లు తగ్గుతున్నాయని రైతులు నకిలీ విత్తనాల వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన వెల్లడించారు.
గడ్డి మందు గ్లైపోసెట్ అమ్మకాలపై వ్యవసాయ అధికారులు నిఘాపెట్టాలని నిరంజన్‌రెడ్డి శనివారం ఆదేశించారు. వానాకాలం వ్యవసాయ ప్రణాళికలో భాగంగా నకిలీ విత్తనాల అమ్మకాలను అరికట్టేందుకు అన్ని జిల్లాల ఎస్పీలు, డీఎఓ, ఎఓలతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, తదితరులు పాల్గొన్నారు.