Friday, November 22, 2024

Odisha : పవర్‌ ప్లాంట్‌లో స్టీమ్ లీక్.. 19మందికి తీవ్రగాయాలు

ప‌వ‌ర్ ప్లాంట్ లో స్టీమ్ లీక్ కావ‌డంతో 19మందికి తీవ్ర‌గాయాలైన ఘ‌ట‌న ఒడిశా రాష్ట్రంలోని ఢెంకనాల్‌ జిల్లాలో జరిగింది. మేరమాండల్‌ ప్రాంతంలో టాటా స్టీల్‌ కు చెందిన బ్లాస్ట్‌ ఫర్నేస్‌ పవర్‌ ప్లాంట్‌లో స్టీమ్‌ (ఆవిరి) లీకైంది. దీంతో 19 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. క్షతగాత్రులను కటక్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కలెక్టర్‌ ఉక్కు కర్మాగారం వద్దకు చేరుకుని సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు.

ఈ ప్రమాదంపై టాటా స్టీల్‌ స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మేరమాండల్‌లోని టాటా స్టీల్‌ వర్క్స్‌ కర్మాగారంలో బీఎఫ్‌పీపీ2 పవర్‌ ప్లాంట్‌ వద్ద ఆవిరి లీక్‌ కారణంగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ఢెంకనాల్‌ ఎస్పీ మాట్లాడుతూ.. వేడి నీటితో ఉన్న వాల్వ్‌ ప్రమాదవశాత్తూ తెరుచుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి తీవ్రంగా కాలిన గాయాలైనట్లు తెలుస్తోంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement