Friday, November 22, 2024

ఇళ్లల్లోనే ఉండండి, కీవ్ వైపు వెళ్లొద్దు-పరిస్థితులు బాగా లేవు: ఇండియన్ ఎంబసీ సూచన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఉక్రెయిన్‌లోని వేర్వేరు నగరాల్లో చికుక్కున్న భారతీయులను సురక్షితంగా భారత్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆ దేశ రాజధాని ‘కీవ్‌’లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ముఖ్యంగా అక్కడ చదువుకోడానికి వెళ్లిన విద్యార్థులను ఉద్దేశించి కొన్ని గంటల వ్యవధిలోనే 3 ప్రకటనలు విడుదల చేసిన ఎంబసీ, దేశమంతటా మార్షల్ లా అమల్లో ఉందని, ఆ కారణంగా ఒక చోట నుంచి మరో చోటుకు చేరుకోవడం కష్టంగా ఉందని తెలియజేసింది. ఉక్రెయిన్ గగనతలాన్ని పూర్తిగా మూసేసిన నేపథ్యంలో ఏ నగరం నుంచీ పౌరవిమానాలను నడిపే పరిస్థితి లేదు. క్షిపణులు, బాంబుల మోతతో దద్ధరిల్లుతున్న ఉక్రెయిన్ మధ్య, తూర్పు ప్రాంతాల నుంచి ఉన్నంతలో కాస్త సురక్షితంగా ఉన్న దేశ పశ్చిమ ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తొలుత ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ క్రమంలో ప్రయత్నాలు రాజధాని కీవ్ నగరంపై ఇష్టానుసారంగా బాంబు దాడులు జరుగుతుండడం, రష్యా సైనిక బలగాలు నగరాన్ని సమీపించడంతో సాధ్యపడలేదని తెలిసింది. ఈ క్రమంలో మరో ప్రకటన జారీ చేస్తూ.. దేశంలో ఎక్కడివారు అక్కడే తమ తమ నివాసాల్లోనే ఉండాలని, వీలైతే సమీపంలోని సురక్షిత బాంబ్ షెల్టర్లకు చేరుకోవాలని సూచించింది. అప్పటికే ప్రయాణాలు మొదలుపెట్టి మధ్యలో చిక్కుకున్నవారు సైతం సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు, లేదా తెలిసినవారి నివాసాలకు చేరుకోవాలని సూచించింది. కీవ్‌ నగరం చేరుకుని ఆశ్రయం లేకుండా ఉన్నవారికోసం, స్థానిక యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతున్నామని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. కీవ్ నగరంలో బాంబు వార్నింగ్‌లు, ఎయిర్ సైరన్లు మోగుతున్నాయని, సైరన్ మోగిన ప్రాంతాలకు సమీపంలో ఉన్న భారతీయులు గూగుల్ మ్యాప్ ద్వారా సమీపంలోని బాంబ్ షెల్టర్‌కు చేరుకోవాలని సూచించింది. కీవ్‌లో చాలా మంది అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్నారని వారికి తెలియజేసింది. అలాగే విద్యార్థులు, భారతీయులందరూ తమ పాస్‌పోర్టులు, పత్రాలను పట్టుకుని వీలైనంత వరకు ఇళ్లల్లోనే ఉండేందుకు ప్రయత్నించాలని సూచించింది.

భారతీయుల రక్షణే మా కర్తవ్యం – పార్థ సత్పతి, ఉక్రెయిన్‌లో భారత రాయబారి
భారత రాయబార కార్యాలయం వరుస ప్రకటనలకు తోడు అక్కడున్న భారతీయులను ఉద్దేశించి భారత రాయబారి పార్థ సత్పతి ఓ ప్రకటన విడుదల చేశారు. బాంబుల మోతతో నిద్రలేచామని, కీవ్ సహా దేశంలో చాలా చోట్ల పరిస్థితి అస్థిరంగా ఉందని వెల్లడించారు. ఉక్రెయిన్‌లోని భారతీయులు ఎక్కడివారు అక్కడే ఉండాలని సూచించారు. చాలామంది దేశ రాజధాని ‘కీవ్’ చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నందున, అలాంటి ప్రయత్నమేదీ చేయవద్దని హితవు పలికారు. ఇప్పటికే ప్రయాణంలో ఉన్నవారు, తమ తమ నివాస ప్రాంతాలకు తిరిగి వెళ్లాలని సూచించారు. కీవ్ నగరంలో చిక్కుకున్నవారు యూనివర్సిటీలు, విద్యా సంస్థలు, స్థానిక భారతీయ సమూహాలను సంప్రదించి ఆశ్రయం పొందాల్సిందిగా సూచించారు. ఉక్రెయిన్‌లోని భారతీయులకు అవసరమైన సహాయం అందించేందుకు మేం అహర్నిశలు శ్రమిస్తున్నామని పార్థ సత్పతి అన్నారు. ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు హెల్ప్ లైన్ నెంబర్లతో పాటు, సోషల్ మీడియా ఖాతాలను అందుబాటులో ఉంచామమని తెలిపారు.

ఢిల్లీలోని ఉక్రెయిన్ ఎంబసీ ముందు తల్లిదండ్రులు, బంధువుల ఆవేదన
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టిన వార్తలు చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు, బంధుమిత్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉక్రెయిన్‌లో వారి పరిస్థితి తెలుసుకోవడం కోసం, భారత్‌కు తిరిగి తీసుకొచ్చే మార్గాల కోసం అన్వేషిస్తూ కొందరు ఢిల్లీలోని ఉక్రెయిన్ ఎంబసీకి చేరుకున్నారు. ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ద్వారా అక్కడి పరిస్థితిని, తమవారి యోగక్షేమాలను తెలుసుకునేందుకు వారంతా ప్రయత్నాలు చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం విదేశీ వ్యవహారాల శాఖలో ఓ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ నెంబర్లు +91 11 23012113, +91 11 23014104, +91 11 23017905 మరియు 1800118797 (టోల్ ఫ్రీ). అలాగే ఈ-మెయిల్ [email protected] ద్వారా కూడా తమను సంప్రదించవచ్చని విదేశాంగ శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement