వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా తెలంగాణ సర్కారు పోరుకు సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాల్సిందేననీ, దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వడ్ల కొనుగోలులో కేంద్రం వైఖరిపై ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్త నిరసనకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ సర్కారు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిరసనలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ నెల 20 నుంచి జిల్లా పర్యటనలకు వెళ్లనున్నారు. అయితే, కేసీఆర్ జిల్లా పర్యటన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఈనెల 19 నుంచి ప్రారంభం కావాల్సిన కేసీఆర్ జిల్లాల టూర్, ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 23న వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా కొత్త కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
వనపర్తి పర్యటనలో భాగంగా కొత్త మార్కెట్ యార్డు, రెండు పడకల గదుల ఇళ్ల ప్రారంభంతో పాటు వైద్యకళాశాల, నర్సింగ్ కళాశాల, కర్నెతండా ఎత్తిపోతల పథకం, వేరుశనగ పరిశోధనా కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, నీటి పారుదల శాఖ సీఈ కార్యాలయాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, వనపర్తిలో టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో అక్కడ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.
ఇక జిల్లాల పర్యటనలో భాగంగా కేంద్రంపై పోరుకు సిద్దంగా.. ధాన్యం పండిస్తున్న అన్నదాతలు పడుతున్న కష్టాలను హైలెట్ చేయనున్నారని తెలిసింది. అలాగే, రాష్ట్రంలో దూకుడుగా ముందుకు సాగుతున్న బీజేపీతో పాటు ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ పర్యటన కొనసాగించనున్నారని సమాచారం. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు కురిపిస్తున్న విమర్శలను తిప్పికొడుతూ.. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలను అడ్డుకట్టవేసే విధంగా ప్రజల్లోకి వెళ్లడానికి కేసీఆర్ పక్కా ప్రణాళికలతో ముందుకెళ్లడానికి సిద్ధమయ్యారని తెలిసింది.