ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలోని అడవిలో విసిరేసినట్టు ఉంటుందా విలేజ్.. అయితే.. అక్కడ సమష్టిగా నిర్వహించిన కొన్ని పనులతో ఇప్పుడా ఊరు యావత్ దేశ ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలను 100కు 100శాతం అమలు చేసి ఆదర్శంగా నిలిచింది. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారాక రామారావు నుంచి ప్రశంసలు అందుకుని మురిసిపోతున్నారు ముక్రా గ్రామస్తులు.. అయితే.. ఈ ఆదర్శం వెనుకు ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకుందామా?
ఆదిలాబాద్ బ్యూరో (ప్రభన్యూస్) : ముక్రా గ్రామం ఇప్పుడు తెలంగాణ రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచిందంటే దాని వెనుక పెద్ద సంఘర్షణ దాగుంది. ఎన్నో సవాళ్లను స్వీకరించారు ఆ గ్రామస్తులు. గడచిన ఎనిమిదేళ్లుగా ప్రతి పథకాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి.. వాటి ఫలాలు పూర్తిగా తీసుకునేలా అక్కడి లీడర్లు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ గ్రామంలో అన్ని పథకాలు వందకు వందశాతం అమలయ్యాయి. గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు సొంతంగా గ్రామంలోనే వర్మికంపోస్ట్ లాంటి ఎరువులు తయారు చేసి వాటిని విక్రయించి ఆ నిధులను కూడా గ్రామాభివృద్ధికే వినియోగించుకుంటున్నారు. గ్రామం మొత్తం ఏకతాటిపై ఉండటంతోనే అక్కడ మద్యం, మాంసం వంటివి పూర్తిగా నేషేధించారు. ఇవి కూడా అందరూ పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మోక్రా గ్రామం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోంది.
ఏడేళ్లలో రూ. 33 కోట్ల అభివృద్ధి..
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా గ్రామంలో గడచిన ఎనిమిదేళ్లుగా పరిశీలిస్తే ఆ గ్రామస్థులు మొత్తం రూ. 33 కోట్ల అభివృద్ధి నిధులు వినియోగించుకున్నారు .దీంతో ఆ గ్రామంలో వందశాతం పథకాలు అమలైనట్లు రుజువైంది. ఈ నేపథ్యంలో 100% సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ఏకైక గ్రామంగా నిలిచింది. ఉత్తమ గ్రామ పంచాయతీగా స్వల్ప వ్యవధిలోనే దేశవ్యాప్తంగా పేరుగాంచింది.
ఆధ్యాత్మికం వారి అభివృద్ధి పథం..
ముక్ర గ్రామస్తులంతా మొదటి నుంచి ఒకేమాటపై నిలబడ్డారు. నేతలు ఎవరైనా ఏదైనా నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటారు. గ్రామంలో మద్యం, మాంసం విక్రయాలు చేయొద్దని పదిహేనేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయానికి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండటం గమనార్హం. రోజూ ఉదయం సాయంకాలాలు దేవుని భజనలు చేయడం, ఊరంతా కలిసి శాఖాహార భోజనాలు సహపంక్తిగా చెయ్యడం అలవర్చుకున్నారు. గ్రామ పంచాయతీల్లో ఉన్న మిగులు నిధులను అదే గ్రామానికి చెందిన పేదవారి పెళ్లిళ్లకు, ఇతర సహాయార్థం వడ్డీ లేకుండా అందజేస్తున్నారు.
ముక్రా గ్రామం పేరు దేశవ్యాప్తంగా ప్రచారం..
ఇచ్చోడ మండలం లోని ముక్ర కె గ్రామము పేరు ఇప్పుడు దేశంలోనే మార్మోగుతోంది. ఎనిమిది సంవత్సరాల కాలంలో గ్రామంలో 35 పథకాల ద్వారా రూ. 33 కోట్ల పైచిలుకు నిధులతో అభివృద్ధి పనులు చేయడంతో పాటు పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామం రూపురేఖలే మారిపోయాయి. గ్రామస్థులు అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని సర్పంచ్ గాడ్గే మీనాక్షి తెలిపారు. గ్రామంలో ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలతో పాటు ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అమలవుతున్న ఏకైక గ్రామం ముక్ర.కె ఒక్కటే అని ఆమె చెప్పుకొచ్చారు. గ్రామంలోని వ్యర్థాల ద్వారా వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేసుకుని దానిని విక్రయించి స్వయం ఉపాధి పొందుతున్న దేశంలోనే ఏకైక గ్రామమన్నారు.