– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
ఎల్లుండి (28వ తేదీ ఆదివారం) తెల్లవారు జామునే పాత పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు పూజలు చేయనున్నారు. ఈ క్రతువులో ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌తో పాటు పలువురు సీనియర్ మంత్రులు పాల్గొంటారు. పూజ తర్వాత వీరంతా లోక్‌సభ, రాజ్యసభ చాంబర్లను సందర్శిస్తారు.
ఇక.. లోక్‌సభ స్పీకర్ కుర్చీకి కుడిపక్కన పెట్టే సెంగోల్ (రాజదండం)ని ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి వచ్చిన పూజారులతో పాటు సెంగోల్ రూపకర్తలు కూడా హాజరుకానున్నట్టు తెలుస్తోంది. అనంతరం కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ఆవరణలో పూజలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమాలన్నీ ఉదయం 9.30 లోపే పూర్తి చేయనున్నారు..
కాగా, ఆ తర్వాత మధ్యాహ్నం సమయంలో జాతీయ గీతాలాపనతో రెండో దశ ప్రారంభ వేడుకలు షురూ కానున్నాయి. లోక్‌సభ చాంబర్లో జరిగే ఈ ప్రోగ్రామ్‌కి ప్రధాని మోదీతోపాటు అతిథులు పాల్గొననున్నారు. తర్వాత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రసంగించనున్నట్టు తెలుస్తోంది. ఇక.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ప్రసంగం ఉండబోతోంది. తర్వాత పార్లమెంట్ నిర్మాణ సమయంలో అనేక ఘట్టాలతో రూపొందించిన వీడియోలను ప్రదర్శించనున్నట్టు తెలుస్తోంది.
అయితే.. ఈ ప్రోగ్రామ్ని దేశంలోని 19 పార్టీలు బహిష్కరించాయి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు ఆహానం పంపారు. అయినా కొత్త పార్లమెంట్‌ను రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతి కాకుండా ప్రధాని ప్రారంభించడాన్ని వారంతా వ్యతిరేకిస్తున్నారు.
సెంగోల్‌పై మాటల యుద్ధం
చారిత్రక నేపథ్యం కలిగిన సెంగోల్ (రాజదండం)ని రాజ్యసభలో ప్రతిష్ఠించడాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బ్రిటిషర్ల నుంచి భారత్‌కు అధికార మార్పిడికి గుర్తుగా రాజదండం అందించారని చెప్పడానికి రుజువుగా ఎలాంటి దస్త్రాలు లేవని కాంగ్రెస్ పార్టీ అంటోంది. అధికార మార్పిడికి సెంగోల్ గుర్తు అని లార్డ్ మౌంట్ బాటన్ కానీ, అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కానీ, రాజగోపాలచారి కానీ చెప్పినట్టు ఎక్కడా ఆధారాలు లేవని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ చెప్పారు. అయితే.. దీన్ని బీజేపీ నేతలు తిప్పికొట్టారు. అదంతా తప్పుడు వాదనలి కొట్టిపారేశారు.