Saturday, November 23, 2024

Spl Story: అంతరిక్షంలో స్టార్​ హోటల్.. అదిరిపోయే ఫెసిలిటీస్​తో నిర్మాణం!

అంతరిక్షం అంటే అంతుచిక్కని రహస్యాలకు నెలవు. అట్లాంటి చోట కూడా హోటల్​ రన్​ చేయాలంటే మాటలు కాదు. ఈ మధ్య కాలంలో ఇండియాతో పాటు చాలా దేశాలు అంగారక (మార్స్​) గ్రహం మీదికి, చంద్రుడి మీదికి రోవర్లను పంపి మానవ అడుగుజాడలు ఏమైనా ఉన్నాయా? మనుషులు నివసించేందుకు వాతావరణం అనువుగా ఉంటుందా? అనే దానితోపాటు.. ఆక్సిజన్​, మొక్కల పెరుగుదల వంటి పలు అంశాలపై పరిశోధనలు చేస్తున్నాయి. అంతేకాకుండా స్పేస్​ ఎక్స్​ పేరిట ఎలన్​మస్క్​ కూడా సొంతంగా అంతరిక్ష యానం చేస్తూ ప్రయోగాలు చేస్తున్నారు.

అయితే..  అంతరిక్షంలోనూ హోటల్ అందుబాటులోకి రానున్నట్టు ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అదీ అత్యంత ఆదునిక ఫెసిలిటీస్ కల్పించనున్నట్టు తెలుస్తోంది. బాగా పైసలున్నోళ్లు ఇక ఎంచక్కా అంతరిక్షంలోకి వెళ్లి, అక్కడా ఎంజాయ్​ చేయొచ్చు. ఆర్బిటల్ అసెంబ్లీ కార్పొరేషన్ (ఓఏఎస్) అనే సంస్థ ఈ స్పేస్ హోటల్ ను నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. దీనికి ‘‘వాయేజర్ స్టేషన్” అనే పేరు కూడా పెట్టింది. 2025లో హోటల్ నిర్మాణం చేపట్టి.. 2027 వరకు కంప్లీట్​ చేస్తామని తెలిపింది. అంతా అనుకున్నట్టు జరిగి నిర్మాణం పూర్తయితే ఇది ప్రపంచంలోనే మొదటి స్పేస్ హోటల్ అవుతుందన్నమాట.

ఈ స్పేస్ హోటల్​లో మన భూమి మీదున్న స్టార్ హోటళ్లలో మాదిరిగానే అత్యాధునిక సౌలతులు ఉండనున్నాయి. రూమ్స్, సినిమా థియేటర్లు, బార్లు, హెల్త్ స్పాలు, జిమ్ లు, రెస్టారెంట్స్,  సిబ్బంది ఉండేందుకు క్వార్టర్లు తదితరాలు ఉండనున్నాయి. పెద్ద పెద్ద క్రూయిజ్ లలో ఉండే అన్ని రకాల సేవలు ఇక్కడ అందుబాటులోకి తేనున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇందులో మొత్తం 400 మందికి ఆతిథ్యం ఇవ్వొచ్చు. ఈ హోటల్ ఒక జెయింట్ వీల్ లాగా ఉంటుందని, ఇందులో మొత్తం 24 మాడ్యూల్స్ ఉంటాయని కంపెనీ తెలిపింది. అయితే.. ఈ మాడ్యూల్స్ ను ఆ కంపెనీ అమ్మకానికి పెట్టనున్నట్టు తెలుస్తోంది. నాసా(National Aeronautics and Space Administration) లాంటి సంస్థలు, ప్రభుత్వాలు, ప్రైవేట్ కంపెనీలు వీటిని కొనుక్కోవచ్చు. అయితే దీని నిర్మాణానికి అయ్యే ఖర్చు, మాడ్యూల్స్ ను ఎంతకు అమ్మనుందనే విషయాలను ఓఏఎస్ సంస్థ వెల్లడించలేదు.

వాయేజర్ ఒక రొటేటింగ్ స్పేస్ స్టేషన్. దీని రొటేషన్ రేటును మార్చడం ద్వారా కృత్రిమ గురుత్వాకర్షణ శక్తి ఏర్పడుతుంది. ఈ ఆర్టిఫిషియల్ గ్రావిటీ మనుషులు ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండేందుకు ఉపయోగపడుతుంది. స్పేస్‌‌లో జీరో గ్రావిటీ ఉంటుంది కాబట్టి ఈ స్పేస్ హోటల్‌‌లో కూడా జీరో గ్రావిటీ ఉంటే.. అక్కడికి వెళ్లేవారు ఎక్కువ సమయం గడపలేరు. అందుకే ఇందులో చంద్రుడి ఉపరితలంపై ఉండేంత గ్రావిటీని కృత్రిమంగా సృష్టించనున్నారు. దీనికోసం స్పేస్ స్టేషన్ ను రొటేషన్ చేస్తారు. ఇది కేవలం 90 నిమిషాల్లోనే భూమి చుట్టూ తిరుగుతు౦ది. గేట్ వే ఫౌండేషన్ కు ‘వాయేజర్ స్టేషన్’ ఐడియా 2012లో వచ్చింది. దాన్ని సాకారం చేసేందుకు 2018లో ఓఏసీని ఏర్పాటు చేసింది. ఈ స్పేస్ హోటల్ నిర్మాణం.. మరో పారిశ్రామిక విప్లవం అవుతుందని గేట్ వే ఫౌండేషన్ ఫౌండర్ జాన్ బ్లింకో అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement