Wednesday, November 20, 2024

రోడ్లు బాగోలేవ్.. రైల్లో ప్ర‌యాణించా.. గ‌డ్క‌రీకి స్టాలిన్ లేఖ‌

రోడ్లు స‌రిగాలేక రైలులో ప్ర‌యాణించాల్సి వ‌చ్చింద‌న్నారు త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్.ఈ నేప‌థ్యంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. చెన్నై-రాణిపేట జాతీయ రహదారి దుస్థితిని తెలిపారు. కాంచీపురం, వెల్లూరు, రాణిపేట్, హోసూర్, కృష్ణగిరిలోని పారిశ్రామిక కారిడార్లను చెన్నై, ఇతర పోర్టులను కలిపే ముఖ్యమైన ఈ జాతీయ రహదారి గుంతలమయంగా మారి చాలా అధ్వాన్నంగా ఉందన్నారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌ ఈ సమస్యను పార్లమెంట్‌లో లేవనెత్తినట్లు గుర్తు చేశారు. అయితే కేంద్ర మంత్రి గడ్కరీ దీనిపై ఇచ్చిన సమాధానం చాలా సాధారణంగా, నిబద్ధత లేన్నట్లుగా ఉందని విమర్శించారు.

కేంద్ర రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, ఇతర అనుమతులపై తమిళనాడు ప్రభుత్వం సత్వరంగా స్పందించినప్పటికీ ఎన్‌హెచ్‌ఏఐకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదనే అభిప్రాయాన్ని నితిన్ గడ్కరీ తన సమాధానంలో వ్యక్తం చేయడం దురదృష్టకరమని స్టాలిన్ ఆ లేఖలో పేర్కొన్నారు. జాతీయ రహదారి 4లోని శ్రీపెరంబుదూర్ నుంచి వాలాజాపేట్ సెక్షన్‌లో ఆరు వరుసల రోడ్డు పనులను కూడా ఆయన ప్రస్తావించారు. కాంట్రాక్టర్లు, ఎన్‌హెచ్‌ఏఐ మధ్య సమస్యల కారణంగా పనులు నిలిచిపోయినట్లు తెలిపారు. దీని వల్ల ప్రస్తుత రహదారి పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందన్నారు.
ఈ నేపథ్యంలో ఈ రహదారి నిర్మాణ పనుల గురించి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని నితిన్ గడ్కరీని స్టాలిన్‌ కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరుఫున తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement