తమిళనాడులో డీఎంకే అఖండ విజయం సాధించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభంజనం సృష్టించి కొత్త చరిత్రను రాసింది. గత లోకసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన డీఎంకే తాజా శాసనసభ ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగించింది. ద్రవిడ ఉద్యమ నేత కరుణానిధి వారసుడు ఎం.కె.స్టాలిన్ ముఖ్యమంత్రి కానున్నారు. సీఎంగా స్టాలిన్ త్వరలో ప్రమాణస్వీకారం కూడా చేయనున్నారు. శాసనసభలో మొత్తం 234 స్థానాలు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటుకు 118 సీట్లు కావాల్సి ఉంది. మిత్రపక్షాలు కాకుండా డీఎంకే ఒక్కటే 131 స్థానాల్లో గెలుపు, ఆధిక్యం సంపాదించి సర్కారు నడపడానికి అవసరమైన మెజార్టీని పొందింది. ఇతర మిత్రపక్షాలతో కలిసి 157 సీట్లు లభించే అవకాశం ఉంది. 155 సీట్లలో గెలిచిన ఈ కూటమి.. మరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కొలత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్టాలిన్ 92,868 ఓట్ల ఆధిక్యతతో అన్నాడీఎంకే అభ్యర్థి టి.సంబత్ కుమాపై గెలుపొందారు.
పదేళ్లుగా ప్రతిపక్షానికే పరిమితమైన డీఎంకేకు ఈ స్థాయిలో ప్రజాదరణ లభించిందంటే అందుకు ముఖ్య కారణం ఆ పార్టీ అధినేత స్టాలిన్. పార్టీ అభ్యర్థుల ఎంపిక నుంచి.. ప్రచారాలు, ప్రజాకర్షక హామీలు, అధికార పార్టీపై విమర్శలు అన్నీ తానై చూసుకున్నారు. డిఎంకే మేనిఫెస్టో అందరిని ఆకర్షించింది. విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో కలిపి 500 హామీలను ఇచ్చింది. విద్యా రుణాల మాఫీ, నీట్ రద్దు, పెట్రో ధరల తగ్గింపు, గృహిణులకు నెలకు రూ.1000 భృతి వంటివి వీటిలో ప్రత్యేకం. ఈ మేనిఫెస్టోకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందని ఫలితాలే సూచిస్తున్నాయి.
అన్నాడీఎంకే ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకత, అసంతృప్తి కూడా ఓ కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా అన్నాడీఎంకేలో నాయకత్వ లేమి కనపడటం, పళనిస్వామి-పన్నీర్‌సెల్వం మధ్య అంతర్గత కుమ్ములాటలు వంటివి స్టాలిన్‌కు కలిసి వచ్చాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.మరోవైపు చిన్నమ్మ శశికళ అంశం కూడా అన్నాడీఎంకేను పట్టిపీడించింది. ఆమె అభిమానుల్లో పార్టీపై వ్యతిరేకత పెరిగి, చివరికి అది డీఎంకేకు మేలు జరిగేలా చేసింది.
అయితే, అన్నాడీఎంకే గట్టి పోటీనే ఇచ్చింది. జయలలితలాంటి ఆకర్షణీయమైన నేతలు ఎవరూ లేనప్పటికీ 72 స్థానాల్లో గెలుపొందింది. ఈ కూటమికి మొత్తంగా 74 సీట్లు వచ్చే అవకాశం ఉంది. డీఎంకేతో పొత్తు పెట్టు కున్న కాంగ్రెస్ 16 చోట్ల విజయం సాధించింది. తన వారసుడు ఉదయనిధి స్టాలిన్ ను రంగంలోకి దింపిన స్టాలిన్.. యువత ఓట్లకు గాలం వేయడంలో విజయం సాధించగలిగారు. హీరో ఉదయనిధి చెన్నై నగరంలోని చేపక్ ట్రిప్లికేన్ లో గెలుపొందారు. మొత్తంగా పదేళ్ల తర్వాత తమిళనాడులో డీఎంకే అధికారం చేపట్టనుంది.