ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న తీరుకు నిసనగా నేడు దేశరాజధాని ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ పార్టీ పోరు కొనసాగించనుంది. ధాన్యం సేకరణలో మోదీ ప్రభుత్వ వివక్షను దేశం మొత్తానికి తెలిసేలా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసన దీక్ష చేయనున్నారు. వడ్ల దీక్షకు తెలంగాణ భవన్ వద్ద 40 అడుగుల వేదికను నిర్మించారు. రెండు వేల మందికిపైగా ప్రతినిధులు కూర్చొనేలా వేదిక కింద ఏర్పాట్లు చేశారు. దీక్షా స్థలికి వచ్చే వారంతా కిందనే కూర్చోవాలి. కుర్చీలను వేయలేదు. తెలంగాణ తల్లి, అమరవీరుల స్థూపాలను వేదిక సమీపంలోనే ఏర్పాటుచేశారు. దీక్ష ఉదయం పది గంటల నుంచి మొదలవుతుంది.
ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ దీక్షకు తెలంగాణ నుంచి టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తండోపతండాలుగా తరలి వెళ్లారు. నిరసన దీక్షకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఢిల్లీ వీధులన్నీ టీఆర్‌ఎస్ నేతలతో నిండిపోయాయి. తెలంగాణ భవన్ వైపు వెళ్లే దారులన్నీ కేంద్ర ప్రభుత్వ వివక్షను నిలదీస్తూ రూపొందించిన హోర్డింగులతో గులాబీ రంగు పులుముకొన్నాయి. పటిష్ఠ భద్రతను ఏర్పాటుచేశారు. ఎండవేడి ఎకువ ఉండటంతో దీక్షా స్థలి వద్ద కూలర్లు పెట్టారు. దీక్షకు వచ్చేవారందరికీ మజ్జిగ, మంచినీళ్లు, భోజనం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండున్నర వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. తెలంగాణ భవన్‌కు పక్కనే ఉన్న నర్సింగ్ కళాశాలకు సంబంధించిన ప్రాంగణంలో భోజన ఏర్పాట్లు చేశారు.