భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. కొత్తగూడెం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే లక్ష్యంతో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్) అడుగులు వేస్తున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తన తండ్రి పేరిట సామాజిక సేవా కార్యక్రమాలను ముమ్మరం చేసిన గడల శ్రీనివాసరావు.. పుట్టిన జిల్లా రుణం తీర్చుకోవాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.. వైద్యం.. ఉపాధి.. విద్యారంగాల్లో వెనుకబడి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు జీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యాలయాన్ని ఇటీవల అట్ట హాసంగా ప్రారంభించారు. వచ్చే నెలలో పెద్ద ఎత్తున ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్, ప్రభ న్యూస్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన కొత్తగూడెం నియోజకవర్గంపై పలువురు కన్నేసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి నాలుగో సారి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు ప్రస్తుతం టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పటికే ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన కూనంనేని సాంబశివరావు, జలగం వెంకట్రావు సైతం తమ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ గట్టి పోటీని ఇవ్వడం ద్వారా గెలుపోటములను నిర్ణయించేలా పోటీ పడుతున్న ఎడవల్లి కృష్ణ (కాంగ్రెస్) తనవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ, బీజేపీనే ప్రత్యామ్నాయమని, ఒక్కసారి అవకాశం కల్పించాలంటూ కోనేరు సత్యనారాయణ(చిన్ని) కోరుతున్నారు. అదేవిధంగా సీపీఎం, టీడీపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయన్న చర్చ సైతం జోరుగా సాగుతోంది.
గూడెంపై హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు గురి
రాష్ట్ర హెల్త్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గడల శ్రీనివాసరావు కొత్తగూడెం నియోజకవర్గంపై ఫోకస్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 12న తన తండ్రి గడల సూర్యనారాయణరావు పేరిట చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యాలయాన్ని కొత్తగూడెంలో ప్రారంభించిన డీహెచ్, కార్పొరేట్ ఆసుపత్రుల సహకారంతో మార్చి 12న పెద్దఎత్తున ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని పేదలకు వైద్యమందించే లక్ష్యంతో ఆయన ఈ కార్యక్రమానికి తన తండ్రి పేరిట శ్రీకారం చుట్టారు. జిల్లాలో పుట్టి, అశ్వాపురంలో 1-7 వరకు, ఏన్కూరు ఏపీ రెసిడెన్సియల్ పాఠశాల తొలి విద్యాసంవత్సర విద్యార్థిగా జాయినై 8-10 వరకు అక్కడే చదివారు. ఖమ్మం పట్టణంలో ఇంటర్ పూర్తి చేసిన ఆయన, ఉస్మానియాలో వైద్యవిద్యనభ్యసించారు. ఆపై ప్రభుత్వ విభాగంలో సేవలందిస్తూ, రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. ఆయన తండ్రి జిల్లాలోనే దాదాపు ఐదు దశాబ్దాల పాటు వైద్యసేవలందించి, ఈ ప్రాంత ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇలా జిల్లాతో విడదీయరాని అనుబంధం కలిగిన గడల శ్రీనివాసరావు జిల్లాకు ఏదైనా చేయాలన్న తలంపుతో తన తం డ్రి పేరిట సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు.
గూడెం రాజకీయాలు విభిన్నం
కొత్తగూడెం నియోజకవర్గంలో రాజకీయాలు విభిన్నంగా ఉంటాయి. సంప్రదాయ ఓటు బ్యాంక్‌తో పాటు, ప్రజల విశ్వాసాన్ని గెలిచిన వారినే విజయం వరిస్తుంది. అటువంటి ఈ నియోజకవర్గంలో ఎందరో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. గతంలో విద్యావంతులైన అయాచితం నాగవాణి(టీడీపీ), జలగం హేమామాలిని(పీఆర్పీ)లు ఎన్నికల కురుక్షేత్రంలో నిలిచినప్పటికీ వారు, విజయం సాధించలేక పోయారు. ప్రస్తుతం డీహెచ్‌గా సుపరిచితులైన శ్రీనివాసరావు కొత్తగూడెం నియోజకవర్గంపై ఫోకస్ పెట్టడంతో పరిస్థితులు ఎలా ఉంటాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల పాల్వంచలో చోటు చేసుకున్న వనమా రాఘవ ఘటనతో, సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు అధికార పార్టీ తరుపున పోటీ చేసే అవకాశాలు సన్నగిల్లుతాయన్న ప్రచారం జరుగుతుండటంతో, అధికార టీఆర్‌ఎస్ నుంచి అభ్యర్థి త్వాన్ని ఆశిస్తూ, గడల శ్రీనివాసరావు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నేత జలగం వెంకట్రావు సైతం సుధీర్ఘ కాలం తరువాత కార్యకర్తలతో వరుస భేటీలు నిర్వహిస్తూ, తానూ పోటీలో ఉన్నాననే సిగ్నల్ ఇస్తున్నారు. అటు విపక్షాలకు చెందిన కూనంనేని సాంబశివరావు, కోనేరు సత్యనారాయణ(చిన్ని), ఎడవల్లి కృష్ణ లు సైతం వనమా ఘటనను తమకు అవకాశంగా మలుచుకునేందుకు తగిన ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. ఇలా నియోజకవర్గంలో ఎవరికి వారు, తామే పోటీలో ఉన్నామన్నట్లుగా అడుగులు వేస్తున్నారు.
పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకే..
‘ఆంధ్రప్రభ’తో హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు
తాను పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకే సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానని హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ‘ఆంధ్రప్రభ’కు తెలిపారు. ఈ జిల్లాలోని పలు ప్రాంతాలు ఆది నుంచి వెనుకబాటుకు గురయ్యాయని, ఇక్కడి ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి కల్పించడమే లక్ష్యంగా తాను తన తండ్రి పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని ఆయన తెలిపారు. తన తండ్రి గడల సూర్యనారాయణ ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైద్యునిగా అన్నివర్గాల ప్రజలకు వైద్యసేవలందించి అందరి ఆదరాభిమానాలు అందుకున్నారన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని తనకు జన్మనిచ్చిన ప్రాంతానికి ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలని సంకల్పించానన్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాతోనే తన తండ్రి తనువు చాలించారని, ఆయన పేరుతో ఆయనతో మమేకమైన ప్రజలకు సేవలందించడమే ధ్యేయమని తెలిపారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్య, ఆరోగ్య సేవలు అందిస్తుందన్నారు. తమ ట్రస్ట్ ద్వారా మార్చి 12న జిల్లా కేంద్రమైన భద్రాద్రి కొత్తగూడెం క్లబ్‌లో మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో వైద్య పరీక్షల నుంచి మందుల పంపిణీ వరకు ఉచితంగానే అందిస్తామన్నారు. వ్యాధి నిర్ధారణ కోసం డయోగ్నొస్టి క్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారికి కూడా పరీక్షల నిర్ధారణ తర్వాత కుటుంబాల ఆర్ధిక పరిస్థితిని బట్టి శస్త్ర చికిత్సలు అందిస్తామన్నారు. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, కంటి సంబంధిత పరీక్షలు కూడా నిర్వహించి అవసరమైన వైద్య చికిత్సలు అందిస్తామన్నారు.