ఇంట్లో తొలి పూజను అందుకుని విఘ్నాలను బాపే అధినాయకుడు గణపతి. మనం సాధారణంగా ఏ కార్యక్రమంను తలపెట్టినా వినాయకుడిని మొదట మొక్కుతూ ఉంటాము. దేశంలో అనేక వినాయకుడు ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో చాలా విశిష్టతను కలిగి ఉన్నాయి. అయితే, ఒక ఆలయంలో వినాయకుడు రంగులు కూడా మారుస్తాడు. వినాయకుడు రంగులు మార్చడమేంటి? అనుకుంటున్నారా? అవును.. ఆర్నెళ్లు తెల్ల రంగులో.. ఆర్నెళ్లు నల్లటి రంగులో దర్శనమిస్తూ.. భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఆ వింత వినాయకుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా?
తమిళనాడులోని నాగర్‌కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఈ వినాయకుడి ఆలయం ఉంది. ఇందులో ముఖ్యంగా ఈ ఆలయంలో ఉన్న మూలవిరాట్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి తనంతట తానే రంగులు మార్చుకొని ఎంతో అద్భుతంగా కనిపిస్తారు. ఉత్తరాయణ కాలంలో నల్లని రంగులో భక్తులకు దర్శనమిస్తాడు.అదేవిధంగా దక్షిణాయన కాలంలో తెలుపు రంగులోకి మారి భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. అదే విధంగా ఈ ఆలయంలో ఉన్న కోనేరు ఉత్తరాయణ కాలంలో వినాయకుడు నలుపురంగులో ఉంటే కోనేరులో ఉన్న నీళ్ళు ఎంతో తేటగా తెలుపు రంగులోకి మారుతాయి. అదేవిధంగా దక్షిణాయన కాలంలో వినాయకుడు తెలుపు రంగులో ఉంటే కోనేరులో నీరు ముదురు నలుపు రంగులోకి మారుతాయి.
అంతేకాదు ఈ ఆలయంలో ఉన్న మర్రిచెట్టు దక్షిణాయన కాలంలో ఆకులు రాల్చి ఉత్తరాయణ కాలంలో చిగురిస్తుంది. ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదనీ చరిత్రకారులు చెబుతున్నారు. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ అని కూడా పిలుస్తారు. నిజానికిది శివాలయం. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించారు. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని అంటారు. ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా, ఈ ఆలయాన్ని ఎన్నోసార్లు పునర్నిర్మించారు. ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. తర్వాతి కాలంలో రాష్ర్టాలు విడిపోయాక, ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో, కేరళ ప్రభుత్వం ఆధిపత్యం తగ్గింది.