గత నాలుగు నెలలుగా శ్రీలంకలో దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి..నిత్యావసర ధరలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆకాశాన్నంటాయి. ఆహారంతోపాటు ఇంధనం ఔషధాల కొరత వారిని తీవ్రంగా వేధిస్తున్నాయి. పెట్రోల్.. డీజిల్ కోసం బంకుల వద్ద క్యూలైన్ లో పడిగాపులు కాస్తున్నారు. ఇలా పెట్రోల్ బంకుల వద్ద క్యూలైన్ లో నిలబడి ఉన్న వారి పట్ల శ్రీలంక మాజీ క్రికెటర్ గొప్ప మనసు చాటుకున్నారు. వారికి టీ.. బ్రెడ్ లను స్వయంగా అందజేస్తున్నారు. మాజీ క్రికెటర్ రోషన్ మహనామా ఈ పనిచేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజధాని కొలంబోలోని వార్డ్ ప్లేస్ విజేరామా మావత పెట్రోల్ బంకుల వద్ద క్యూలైన్ లో నిలబడి అలసిపోయిన ప్రజలకు ఆయన టీ.. బన్ అందజేశారు.
ఈ మేరకు ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ సాయంత్రం కమ్యూనిటీ మీల్ షేర్ బృందంతో కలిసి వార్డ్ ప్లేస్ విజేరామా మావత చుట్టూ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద ఇంధనం కోసం క్యూలో నిలబడిన ప్రజల కోసం టీ బన్స్ అందించాం.. క్యూలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. దీంతో ప్రజలకు అనేక ఆరోగ్య ప్రమాదాలు ఉంటాయని రోషన్ మహనామా ఆవేదన వ్యక్తం చేశారు. క్యూలో ఉండే వారు నలతగా ఉంటే పక్కవారికి చెప్పండని.. లేదా మద్దతు కోసం 1990కి కాల్ చేయాలని రోషన్ మహనామా పిలుపునిచ్చారు. ఈ కష్ట సమయంలో మనం ఒకరికొకరు మద్దతుగా నిలవాలని పిలపునిచ్చారు.