ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో మరోసారి ఆత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని విధించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చేలా అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక సంక్షోభానికి కారణమైన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేయాలని ప్రజలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు గొటబాయ దేశంలో మరోమారు అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఎమర్జెన్సీ వల్ల కారణం చెప్పకుండానే ప్రజలను అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు, భద్రతా బలగాలకు లభించింది.
మరోవైపు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనను మరింత ఉద్ధృతం చేయనున్నట్టు విద్యార్థులు ప్రకటించారు. కార్మిక సంఘాల సమ్మెకు మద్దతుగా వేలాదిమంది విద్యార్థులు కొలంబోలో పార్లమెంటుకు వెళ్లే ప్రధాన రహదారులను దిగ్బంధించారు. ఈరోజు తెల్లవారుజామున, శ్రీలంక పార్లమెంటును ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్న విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగి ప్రయోగించారు.