Friday, November 22, 2024

Terrorism: ఇండియాని దెబ్బతీసేందుకు పాక్​ కుట్ర.. డ్రోన్లతో డ్రగ్స్​, వెపన్స్​ సప్లయ్ చేస్తున్న టెర్రరిస్టులు​

పాకిస్తానీ టెర్రరిస్టులు ఇప్పుడు కొత్త ఎత్తులు పన్నుతున్నారు. భారత్​లోకి ఇబ్బడిముబ్బడిగా డ్రగ్స్​, వెపన్స్​ని సప్లయ్​ చేయడానికి వారికి కొత్త మార్గం దొరికింది. పంజాబ్‌లోని అనేక ముఠాలు, ఖలిస్తాన్ అనుకూల ఉద్యమ మద్దతుదారులు శ్రీ గంగానగర్‌తో పాటు హనుమాన్‌గఢ్ జిల్లాను తమ స్థావరంగా మార్చుకుంటారు. ఈ వ్యక్తులు మూడేళ్లుగా పాకిస్థాన్ నుంచి పంజాబ్‌కు డ్రగ్స్, ఆయుధాలు, పేలుడు పదార్థాల స్మగ్లింగ్‌లో పాల్గొంటున్నట్టు తమ వద్ద ఆధారాలున్నాయని ఎస్పీ ఆనంద్​శర్మ చెప్పారు. వీరిలో కొంతమంది శ్రీ గంగానగర్, హనుమాన్‌గఢ్‌లకు కూడా చేరుకున్నట్టు అనుమానిస్తున్నారు. స్మగ్లింగ్‌తో పాటు ఈ రెండు జిల్లాల్లో ఖలిస్తాన్‌కు మద్దతుగా ప్రజలను సమీకరించేందుకు ఫండ్స్​ అందుతున్నట్టు తెలుస్తోంది. 

కాగా, స్మగ్లింగ్‌కు ఉపయోగించే డ్రోన్‌లను పాకిస్థాన్ కొత్త ఆయుధంగా మార్చుకుంటోంది. ఇది చైనా, టర్కీ నుండి అత్యంత లెటెస్ట్​ మోడల్​ డ్రోన్‌లను కొనుగోలు చేసి, ఇండియా మీదికి పంపుతోంది. ఈ డ్రోన్లు దాదాపు ఐదు కిలోల వరకు డ్రగ్స్, ఆయుధాలు లేదా పేలుడు పదార్థాలను ఈజీగా తీసుకెళ్లే చాన్సెస్​ ఉన్నాయి. అంతేకాకుండా పాకిస్థాన్ గూఢచర్య కార్యకలాపాలకు ఈ డ్రోన్స్​ ఉపయోగించుకుంటున్నట్టు తెలుస్తోంది. 

పంజాబ్‌లో 50కి పైగా కార్యకలాపాలు చేయాలని ప్లాన్​ చేయగా వాటిని దేశ ఇంటెలిజెన్స్​ అధికారులు తిప్పికొట్టారు. ఆ​ తర్వాత రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ జిల్లాని పాకిస్థాన్​ టార్గెట్​ చేసుకుంది. ఈ జిల్లా ఇప్పుడు డ్రగ్స్, ఆయుధాలను అక్రమంగా రవాణా చేయడానికి పాకిస్తాన్ ఏజెన్సీల రాడార్‌లో ఉందని రాష్ట్ర IB, పోలీసులకు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది.

2019 నుండి పాకిస్తాన్ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్, అమృత్‌సర్, తరన్ తరణ్, ఫిరోజ్‌పూర్ జిల్లాలకు సరుకులను పంపుతోంది. అయితే అధికారులు ఇటీవలికాలంలో కఠినమైన భద్రతా చర్యలను పాటించడంతో ఈ ఏడాది మే 11 వరకు, ఈ జిల్లాల్లో BSF డ్రోన్ స్మగ్లింగ్‌కు సంబంధించిన 53 కేసులను పట్టుకున్నారు. తొమ్మిది డ్రోన్‌లను ధ్వంసం చేశారు. దీంతో శ్రీ గంగానార్ జిల్లాకు ఆనుకుని ఉన్న సరిహద్దుపై నిఘా ఉంచాలని రాజస్థాన్ పోలీసు, BSF యొక్క ATS, ఇంటెలిజెన్స్ యూనిట్‌ను IB ఆదేశించింది. కొన్ని నెలలుగా శ్రీ గంగానగర్‌కు డ్రోన్ల ద్వారా డ్రగ్స్ వస్తున్నట్టు కచ్చితమైన సమాచారం ఉందని ఇంటెలిజెన్స్​ విభాగం చెబుతోంది.

కాగా, ప్రస్తుతం సరిహద్దుల్లోని వ్యవసాయ పొలాలున్న రైతులకు డబ్బ ఎర చూపి, స్థానికంగా కార్యకలాపాలు సాగిస్తున్న చిరు స్మగ్లర్లు ఈ పని చేస్తున్నారని అనుమానాలున్నాయి. తాజాగా బీఎస్ఎఫ్, స్థానిక పోలీసులు రెండున్నర నెలల్లో 4 కేసుల్లో రూ.70 కోట్లకు పైగా హెరాయిన్‌ను పట్టుకున్నారు. పంజాబ్ స్మగ్లర్ల మధ్య సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 25 కోట్ల విలువైన హెరాయిన్‌తో కొద్ది రోజుల క్రితం అరెస్ట్‌ చేసిన నలుగురు నిందితులను విచారిస్తున్నారు. పాకిస్థాన్ నుంచి డ్రగ్స్ అందుకున్న నిందితులు పంజాబ్‌తో తమకు సంబంధాలు ఉన్నాయని, నిందితుల కోసం బృందాలను పంపామని చెప్పారు. కొత్త పరిణామం ఏమిటంటే స్మగ్లర్లు కూడా చాలా తెలివిగా మారినట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి..  

Advertisement

తాజా వార్తలు

Advertisement