Monday, November 18, 2024

భారత్​లో మరో వ్యాక్సిన్.. స్పుత్నిక్ వి టీకాకు అనుమతి!

భారత్ లో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వి, టీకాకు భారత్​లో అనుమతి లభించింది. టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతించింది. టీకాకు అనుమతుల విషయంపై సోమవారం భేటీ అయిన నిపుణుల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

దేశంలో ప్రస్తుతం సీరం ఇనిస్టిట్యూట్‌ తయారు చేస్తున్న కొవిషీల్డ్, భారత్ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాలను వినియోగిస్తున్నారు. అయితే చాలా రాష్ట్రాల్లో ఆయా టీకాల కొరత ఏర్పడింది. తమకు అత్యవసరంగా టీకాలను పంపాలని వివిధ రాష్ట్రాలు కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి. ప్రముఖ ఔషధ ఉత్పత్తి సంస్థ డాక్టర్ రెడ్డీస్​.. భారత్‌లో స్పుత్నిక్-వి టీకా క్లినికల్స్ ట్రయల్స్‌ నిర్వహిస్తోంది. ఈ టీకాకు సంబంధించి ఇప్పటికే చాలా సమాచారాన్ని సీడీఎస్​సీఓ కోరగా డాక్టర్‌ రెడ్డీస్ సంస్థ అందించినట్లు తెలుస్తోంది. సుత్నిక్-వి టీకాను ఇప్పటికే అనేక దేశాల్లో వినియోగిస్తున్నారు. తాజాగా భారత దేశంలోకి కూడా అందుబాటులోకి రానుండడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్ర‌స్తుతం ఇండియాలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు అందుబాటులో ఉన్న విష‌యం తెలిసిందే. వీటికి అద‌నంగా ర‌ష్యాకు చెందిన స్పుత్నిక్ వి రానుంది. అంతేకాదు జాన్స‌న్ అండ్ జాన్స‌న్ వ్యాక్సిన్ (బ‌యోలాజిక్ ఇ ద్వారా), నొవావాక్స్ వ్యాక్సిన్ (సీర‌మ్ ద్వారా), జైడ‌స్ కాడిలా వ్యాక్సిన్‌, భార‌త్ బ‌యోటెక్‌కు చెందిన ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రానున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

కాగా, భారత్ లో డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్స్‌తోపాటు హెటెరో బ‌యోఫార్మా, గ్లాండ్ ఫార్మా, స్టెలిస్ బ‌యోఫార్మా, విక్రో బ‌యోటెక్‌ ఈ స్పుత్నిక్ విని త‌యారు చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement