Friday, November 22, 2024

STORY – ఆర్టీసీని లాభాల బాట ప‌ట్టేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్న అధికారులు..

నిజామాబాద్ మార్చ్ 23 ప్రభ న్యూస్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు ఎన్నో మెరుగైన సేవలందించేందుకు మార్గాలను అన్వేషించడంతోపాటు రోడ్డు రవాణా సంస్థను లాభాల బాటలో తీసుకువెళ్లడం దేశంలోనే తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థలు ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్న ఏకైక లక్ష్యంతో రోడ్డు రవాణా సంస్థ ఎండి సజ్జనర్, రోడ్డు రవాణా సంస్థ చైర్మన్, నిజాంబాద్ రూరల్ నియోజకవర్గనికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్ర కృషి చేస్తున్నారు. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతోంది. ఏడాది పాటు కరోనా ప్రపంచాన్ని గడగడలాడించింది. కరోనా ప్రభావం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపై తీవ్రంగా పడింది. నెలలపాటు ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. సిబ్బంది జీతభత్యాలు చెల్లించడంలో రోడ్డు రవాణా సంస్థ పడరాని పాట్లు పడింది. బస్సు చక్రాలు కదలకపోవడంతో సంస్థగా రావాల్సిన ఆదాయం క్షమించి వ్యవస్థ కుప్పకూలింది. రోడ్డు రవాణా సంస్థ ప్రజలకు మెరుగైన సేవలను అందించటం తో పాటు రోడ్డు రవాణా సంస్థను లాభాల బాటలోకి తీసుకు వెళ్లేందుకు రోడ్డు రవాణా సంస్థ యండి లు తీవ్ర కృషి చేస్తున్నారు. వేసవిలో 100 రోజుల ఛాలెంజ్ను సవాలుగా తీసుకొని అధిక కిలోమీటర్లు ప్రయాణం చేయడంతో పాటు అధిక రాబడిని తీసుకొచ్చి తీరాలని సజ్జనార్ కొరడా గుప్పిస్తున్నారు.

ఎండిగా సజ్జనర్ పగ్గాలు చేతబట్టి నాటి నుండి కార్మికుల్లో సిబ్బందిలో అధికారుల్లో దడ మొదలైంది. రోడ్డు రవాణా సంస్థలు ఎన్నో మార్పులను ఇప్పటికే తీసుకొచ్చారు. దూర ప్రాంతాలకు ప్రయాణించే బస్సులకు ఇప్పటికే టీమ్స్ సర్వీసులను అత్యధికంగా నడుపుతున్నారు. టిమ్స్ సర్వీస్ బస్సుల్లో డ్రైవర్లు బస్సులు నడపడంతో పాటు టికెట్లను కూడా తీసుకోవాల్సిన బాధ్యత నెత్తిన పెట్టారు. ఇప్పటికే దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు సుగమం చేసేందుకు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన బస్సులను నడుపుతున్నారు. ప్రతి జిల్లా కేంద్రం నుండి ముఖ్య పట్టణము హైదరాబాద్ కి ఏసీ బస్సులను నడపడంతోపాటు నాన్ స్టాప్ నిబంధనలతో ప్రయాణికులకు సమయం కలిసొచ్చే ఏర్పాట్లు చేశారు. ఏసీ నాన్ స్టాప్ బస్సుల వల్ల ఆర్టీసీ మంచి లాభాలను గడిస్తుంది. ప్రతి జిల్లాకు వంద చొప్పున ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో అందించేందుకు రోడ్డు రవాణా సంస్థ ఏర్పాట్లను చేస్తుంది. ఎలక్ట్రిక్ బస్సులు రంగ ప్రవేశం చేస్తే డ్రైవర్లు ఉపాధి కోల్పోతారు. ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేసే కంపెనీ వారి డ్రైవర్లను నియమిస్తారు. ఇప్పటికే అద్దె బస్సులను పెద్ద ఎత్తున రోడ్డు రవాణా సంస్థలు కొనసాగిస్తున్నారు.

అద్దె బస్సుల పేరిట డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. టీమ్స్ పేరిట కండక్టర్లు భవిష్యత్తులో తమ ఉద్యోగ అవకాశాలను కోల్పోనున్నారు. గతంలో ఆర్టీసీ సంస్థలో పనిచేసేందుకు కార్మికులు ఎంత ఉత్సాహం చూపేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కఠినంగా వ్యవహరించడంతో డ్రైవర్లు కండక్టర్లు విధి నిర్వహణ భారంగా మారిందని చెప్పవచ్చు. రోడ్డు రవాణా సంస్థని ప్రభుత్వాలు ప్రైవేట్ పరం చేసి చేతులు దులుపుకోవాలన్న పరిస్థితుల్లో ఆలోచన చేస్తున్నాయి. కార్మికుల శ్రేయస్సు కోరి రోడ్డు రవాణా సంస్థను లాభాల బాటలో నడిపించి తీరాలన్న దృఢ సంకల్పంతో ఎండి సజ్జనార్ కఠిన చర్యలు తీసుకోక తప్పడం లేదు.

ఉద్యోగులకు రోడ్డు రవాణా సంస్థ 60 ఏళ్లకు వయోపరిమితిని పెంచింది. వయోపరిమితి పెంపు డ్రైవర్లకు గుదిబండగా మారింది. నిజాంబాద్ జిల్లాలో ఇప్పటికే చాలామంది డ్రైవర్లు చూపు సరిగా కనపడకపోవడంతో వారు వేరే విధులను నిర్వహిస్తున్నారు. మరో పక్క ఆర్టీసీ సంస్థలో గత కొన్నేళ్ల నుండి కార్మిక సంఘ నాయకులు తమ కర్ర పెత్తనాన్ని చేయడం పట్ల కార్యక్రమం కార్మిక వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో కార్మికులకు ప్రత్యేక శిక్షణ తరగతులు కొనసాగిస్తున్నారు. వేసవిలో 100 రోజుల ఛాలెంజ్ను ఏ రకంగా ముందుకు తీసుకు వెళ్లాలన్న ఆలోచనలు కార్మికులకు శిక్షణ ఇస్తూ లాభాల బాటలో నడిపే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు రవాణా సంస్థ బస్సులు విరివిగా తిరిగేవి. ప్రస్తుత పరిస్థితుల్లో ద్విచక్ర వాహనాలు గ్రామాల్లో అధికంగా కొనుగోలు చేయడం, ఆటోలు అత్యధికంగా నిరుద్యోగులు కొనుగోలు చేసి ప్రయాణికులను చేరవేయడంతో ప్రయాణికులు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీకి కొంత మేరకు దూరమయ్యారు. ప్రయాణికులు కరువు కావడంతో రోడ్డు రవాణా సంస్థ గ్రామీణ ప్రాంతాలకు తిప్పే బస్సుల సంఖ్యను తగ్గించింది. పెద్ద పెద్ద పట్టణాలకు నగరాలకు అత్యాధునిక అత్యధిక సౌకర్యాలతో ప్రతినిత్యం బస్ సర్వీసులను ఏర్పాటు చేసి లాభాలను అర్జించే పనిలో పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement