అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్న ఫిషింగ్ క్యాట్స్ సంరక్షణకు ఏపీ సర్కారు చర్యలు తీసుకుంటోంది. దీనికి గాను చిన్నారులను అంబాసిడర్లుగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చిన్నారుల రిక్రూట్‌మెంట్ కోసం చర్యలు తీసుకుంటోంది. ఫిషింగ్ క్యాట్స్ అనేవి అడవి పిల్లి జాతికి చెందినవి. కాగా, మన ఇండ్లల్లో కనిపించే పిల్లుల కన్నా ఇవి చాలా పెద్దగా ఉంటాయి. రాత్రివేళ మాత్రమే బయటకు వచ్చి వేటాడడం వీటి స్పెషాలిటీ.
అయితే.. ఈ ఫిషింగ్ క్యాట్స్ నీళ్లల్లో ఈజీగా బతికేయగలవు. ఎక్కువగా చేపలను మాత్రమే వేటాడి తింటాయి. చేపలను పట్టుకునేందుకు వీలుగా వీటి పాదాల నిర్మాణం ఉంటుంది. చిత్తడి నేలలు, మడ అడవులు, మంచి నీటి సరస్సులు ఉండే ప్రాంతాల్లో ఈ ఫిషింగ్ క్యాట్స్ ఎక్కువగా కనబడుతుంటాయి.
తూర్పు కనుమలు, హిమాలయాల పాదాల ప్రాంతాలు, గంగా, బ్రహ్మపుత్ర లోయలు.. పశ్చిమ కనుమల్లోనూ నివసిస్తూ ఉంటాయి. ఎక్కువగా సుందర్బన్ డెల్టా, చిలుక సరస్సు, చుట్టపక్కల చిత్తడి నేలలు, కోరింగ, కృష్ణా నదీ మడ అడవుల్లో కనబడతాయని జంతుశాస్త్రవేత్తలు అంటున్నారు.
వేటాడే పిల్లులు The International Union for Conservation of Nature (IUCN) Red List of Threatened Species జాబితాలో ఉన్నాయి. అంతరించి పోయే జాతుల జాబితాలో డేంజర్ లెవల్ లో ఉండడంతో వీటిని కాపాడాలని ప్రభుత్వం భావిస్తోంది. చిత్తడి నేలలు, చేపలు తగ్గి పోతుండటంతో వీటి మనుగడ కష్టమవుతోంది. అందుకని వీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..