ప్రభన్యూస్ : దేశంలోని ప్రముఖ సాంస్కృతిక, వారసత్వ, ప్రముఖ చారిత్రక యాత్రా స్థలాలను కలుపుతూ ప్రత్యేక సర్క్యూట్ రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ఈ రైళ్లను ప్రైవేట్ సంస్థలు నడుపుకొనే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించింది. రైల్వే మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ‘భారత్ గౌరవ్’ పేరిట ఇతివృత్త ఆధారిత పర్యాటక సర్క్యూట్ రైళ్లను ప్రవేశపెట్టడానికి ప్రతిపాదించింది. దేశంలోని ముఖ్యమైన యాత్రా స్థలాల విశేషాలను ప్రజలకు, ప్రపంచానికి తెలియచేయాలనేదే ప్రధాన లక్ష్యం. ఈ రైళ్ల ద్వారా ప్రయాణికులు నిరాటంకంగా పర్యటించే అవకాశాలతోపాటు, పర్యాటక రంగం అభివృద్ధికి కూడా తోడ్పడనుంది. వ్యక్తిగతంగా, భాగస్వామ్య సంస్థగా, కంపెనీగా, వ్యాపార సంస్థలు ఇందులో పాల్గొనవచ్చు. భారత్ గౌరవ్ రైళ్ల నిర్వహణలో ప్రైవేట్ సంస్థలకు ఇతివృత్త పర్యాటక మార్గాలను ఎంపిక చేసుకునే, దర్శనీయ స్థలాలు, చార్జీలు, ఇతర అంశాలపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తోంది.
పది రోజుల్లో ఈ రైళ్లకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానుండగా.. ఆసక్తి గలవారు ఆన్లైన్ ద్వారా ఇండియన్‌రైల్వేస్.జీవోవీ.ఐఎన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేసుకున్న సర్వీసు ప్రొవైడర్లు వారికి కావాల్సిన విధంగా రేక్ కూర్పు(కనీసంగా 14, గరిష్టంగా 20 కోచులు) ఎంపిక చేసుకునే అవకాశముంది. రైల్వే వారి మౌలిక సదుపాయాలను, రోలింగ్ స్టాక్‌ను వినియోగించుకునేందుకు నిబంధనల ప్రకారం ‘రైట్ టూ యూజ్’ చార్జీలు, ఫిక్స్డ్, వేరియబుల్ హాలేజ్ చార్జీలు, స్టాబ్లింగ్ చార్జీలు వంటివి సర్వీసు ప్రొవైడర్లకు విధిస్తారు. ఈ రైళ్లను మెయిల్/ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సమానంగా పరిగణిస్తారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital